విశాఖ జిల్లా అనకాపల్లి ఉద్యాన పరిశోధన స్థానాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం.. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం టి. వెంకుపాలెంలో ఉద్యాన పరిశోధన కేంద్రాన్నిఏర్పాటుచేయాలని నిర్ణయించింది. అప్పటి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఉద్యాన వర్శిటి పాలకమండలి సభ్యులు కావడం వల్ల అనకాపల్లిలో ఉద్యానపరిశోధన స్థానం ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపారు. అనకాపల్లి మార్కెట్ యార్డులో 2018 మార్చిలో తాత్కాలిక కేంద్రాన్ని ప్రారంభించి ఇద్దరు శాస్త్రవేత్తలు, ఒక ఉద్యోగిని నియమించారు.
టి. వెంకుపాలెంలోని ఉద్యాన కేంద్రానికి మంజూరు చేసిన వంద ఎకరాల భూసేకరణలో వివాదాలు తలెత్తాయి. ఇప్పటివరకూ ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. స్థల సేకరణ కొలిక్కి రాకపోవడంతో తాత్కాలికంగా పరిశోధన స్థానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో స్థల సేకరణకు ఆరు కోట్లు, మౌలిక సదుపాయాలకి మరో 4.81 కోట్లు మంజూరు చేశారు.
ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తూ ఇక్కడ పనిచేస్తున్న శాస్త్రవేత్తలను ఇతర ప్రాంతాలకు బదిలీచేశారు. ఉత్తరాంధ్రలో 1.44 లక్షల హెక్టార్లలో జీడిమామిడి సాగు చేస్తుండగా, 21,500 హెక్టార్లలో కొబ్బరి సాగు చేస్తున్నారు. విశాఖ జిల్లాలో 11 వేల హెక్టార్లు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో 4 వేల హెక్టార్లలలో కూరగాయల సాగు చేస్తున్నారు.
ఇటీవల కాలంలో ఉద్యాన పంటలకు తెగుళ్లు, పురుగుల తాకిడి ఎక్కువుగా ఉంటుంది. మామిడి, జీడిమామిడికి పూత దశలోనే పురుగులు ఆశిస్తున్నాయి. ఉద్యాన పంటల సాగు చేసే రైతులకు తగిన సలహాలు సూచనలు అందించాల్సిన ఉద్యాన పరిశోధనా స్థానం స్థానికంగా ఉంటే ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి : గూడ్స్ బోగీపై యువకుని సెల్ఫీ.. విద్యుత్ షాక్తో మృతి