విశాఖ జిల్లా చోడవరం తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కారు. తహసీల్దార్ రవికుమార్, డిప్యూటీ తహసీల్దార్ రాజా రూ.4.50 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. చోడవరం మండలం గాంధీ గ్రామానికి చెందిన చలపతిశెట్టి, వెంకటరామకృష్ణ కలిసి నర్సాపురంలో 1.66 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. భూమార్పిడి చేసేందుకు గత నెల రోజులుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టు తిరుగుతున్నారు. ఈ విషయంలో తహసీల్దార్ రవికుమార్ బాధితుడి నుంచి రూ.20 లక్షలు డిమాండ్ చేశారు. అయితే చివరికి రూ.4 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే నర్సీపేటలోని 50 సెంట్ల భూమిని కన్‌వర్షన్ చేసేందుకు డిప్యూటీ తహసీల్దార్ రూ.50వేలు డిమాండ్ చేశారు.
పది రోజుల క్రితమే బాధితులిద్దరూ ఏసీబీ అధికారులను ఆశ్రయించి విషయాన్ని వివరించారు. డబ్బు సిద్ధం చేశానని.. ఎక్కడికి తీసుకురావాలో చెప్పాలని తహసీల్దార్ రవికుమార్‌కు బాధితుడు ఫోన్ చేశాడు. నేరుగా కార్యాలయానికి తీసుకురావొద్దని.. తన కారు డ్రైవర్‌కు ఇవ్వాలని చెప్పారు. అప్పటికే కార్యాలయం వద్ద మాటువేసిన ఏసీబీ అధికారులు డ్రైవర్ వద్దనున్న డబ్బును తీసుకుంటుండగా ఎమ్మార్వో, డిప్యూటీ ఎమ్మార్వోలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని మూసేసి నిందితుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నారు.
కడపలోనూ..
కడప జిల్లా రాయచోటి మండలం చెంచురెడ్డిగారి పల్లెకు చెందిన క్లాస్ ఫోర్ కాంట్రాక్టర్ అయిన హరినాథ్ రెడ్డి జగనన్న కాలనీకి ఆరు లక్షల రూపాయలతో నీటి సరఫరాకు పనులు చేశారు. ఆ పనులకు సంబంధించిన దస్త్రాలు కడప ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లికార్జునప్ప వద్ద ఉన్నాయి. డబ్బులు మంజూరు చేయాలంటే 6 వేల రూపాయలు లంచం కావాలని కాంట్రాక్టర్‌ను మల్లికార్జునప్ప అడిగాడు. లంచం ఇవ్వడానికి ఇష్టపడని కాంట్రాక్టర్ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటున్న ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి కర్నూలు ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు కడప ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి: పేదలపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకే.. వైఎస్ఆర్ బీమా: సీఎం జగన్