ఆటో ప్రయాణికులకు అత్యాధునిక భద్రత కల్పించడానికి వీలుగా పోలీసులు, రవాణాశాఖ అధికారులు విస్తృత కసరత్తు చేస్తున్నారు. అందుకోసం ‘'అభయం'’ పేరుతో ఒక ఉపకరణాన్ని విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. దాని పనితీరును ప్రయోగాత్మకంగా తెలుసుకోవడానికి వీలుగా ఇప్పటికే సుమారు రెండువేల అభయ ఉపకరణాలను విశాఖ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆటోలకు బిగించారు.
పోలీసుల కనుసన్నల్లో ప్రయాణం
అభయ ఉపకరణం ఉన్న ఆటోలు పోలీసుల కనుసన్నల్లో ఉంటాయి. అవి ఎప్పుడెప్పుడు? ఏఏ మార్గాల్లో? ఎక్కడెక్కడ? తిరుగుతున్నాయన్న అంశాలు, ఎప్పటికప్పుడు నమోదవుతుంటాయి. ఫలితంగా ఆయా ఆటోల్లో ప్రయాణికులకు తగిన భద్రత ఉంటుందన్నది ఆలోచన.
మీట నొక్కితే క్షణాల్లో పోలీసులొస్తారు..
‘అభయ’ ఉపకరణానికి ఒక అత్యవసర మీట ఉంటుంది. ఆటోలో ప్రయాణించే వారు ఆ మీట నొక్కిన వెంటనే పోలీసుల నియంత్రణ గదిలోని సిబ్బంది అప్రమత్తమై ఆ ఆటో ఉన్న ప్రదేశానికి సమీపంలోని పోలీసులను క్షణాల్లోనే పంపిస్తారు. ప్రయాణికులు మీట నొక్కారంటే వారు ఆపదలో ఉన్నట్లు పోలీసులు పరిగణిస్తారు.
ప్రతి ఉపకరణానికి ఒక నెంబర్..
ప్రతి అభయ ఉపకరణానికి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. ఫలితంగా ఆ ఉపకరణం వినియోగిస్తున్న ఆటో వివరాలు, దాని యజమానుల వివరాలు పోలీసులకు క్షణాల్లో తెలుస్తాయి. ఆ ఉపకరణాన్ని ఆటోడ్రైవర్లకు ఉచితంగానే ఇస్తారు. రవాణాశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు ప్రక్రియ జరుగుతోంది.
డ్రైవింగ్ లైసెన్స్‌పై గుర్తులు
ఉపకరణం వినియోగిస్తున్న డ్రైవర్లకు కొత్త డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు ఇస్తున్నారు. గతంలో ఉన్న లైసెన్స్‌కు కొన్ని మార్కింగులు, సీరియల్ నెంబర్లను జోడించి నూతన కార్డులు జారీ చేస్తున్నారు.
తప్పు చేస్తే ఆటో ఇంజన్ ఆఫ్..
ఆటోలో ప్రయాణిస్తున్న మహిళల విషయంలో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, వారిని ఇబ్బందులకు గురిచేసినా ప్రయాణికులు మీట నొక్కితే చాలు. కొద్ది క్షణాల్లో ఆటో ఇంజన్ ఆగిపోతుంది. ఆయా ఆటోలు తప్పించుకోకుండా పోలీసు నియంత్రణ గది నుంచే ఇంజన్లను ఆపే వెసులుబాటు కూడా ఉండడం విశేషం. పోలీసులు వచ్చి పరిశీలించిన తర్వాతే ఆ ఆటో మళ్లీ కదలడానికి అవకాశం ఉంటుంది.
సమయం వృథా కాకుండా చేయాలి
అభయ ఉపకరణాన్ని ప్రయోగాత్మకంగా నా ఆటోకు బిగించారు. ఇందుకు ఓ రోజు రవాణాశాఖ కార్యాలయం దగ్గరే ఉండాల్సి వచ్చింది. సమయం వృథా చేయకుండా వేగంగా బిగిస్తే డ్రైవర్లకు ఆదాయం పోకుండా ఉంటుంది. ఆటోలు అపహరణకు గురికాకుండా కూడా కాపాడుతుందని చెప్పారు. ఈ సదుపాయం మాకెంతో ఉపయుక్తం. కె.రామారావు
సాంకేతిక సమస్యలు అరికడితేనే..
ప్రయాణికులు అనవసరంగా మీట నొక్కితే ఆటో గంటలపాటు ఆగిపోకుండా చూడాలి. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలి. - షేక్ రహిమాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి, విశాఖ జిల్లా ఆటోరిక్షా కార్మిక సంఘం
ఇదీ చదవండి: నివర్ తుపాన్ : ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలపై ప్రభావం!