పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం.. మారుతున్న సమాజం మనలో కొత్త ఆలోచనలకు నాంది పలుకుతోంది. రాపిడో, ఓలా, ఉబర్, బౌన్స్ వంటి కంపెనీల్లో ఉన్న ద్విచక్రవాహన సేవలను ప్రస్తుత తరం బాగా ఉపయోగించుకుంటున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్నా ఫోన్లో లోకేషన్ ఆన్ చేసి క్లిక్ చేస్తే చాలు క్షణాల్లో బైక్, కారు ఇంటిముందుకొచ్చేస్తాయి..! అయితే ఈ సేవలు అందించేవారు ఓ వైపు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూనే ఇలా పని చేయడం గమనార్హం.
రెండు రోజులు మాత్రమే
విజయవాడ, విశాఖ లాంటి నగరాల్లో ఉంటూ పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్నవారు సైతం వీటిని ఒక ఆదాయ వనరుగా మలుచుకున్నారు. వారంలో 5 రోజులు చదువుకుంటూ శని, ఆదివారాల్లో మాత్రం ఇలా బైక్ నడుపుతూ.. ఖర్చులకు సరిపడా సంపాదిస్తున్నారు.
భద్రతపరంగా బాగుంది..
ఈ బైక్లను వినియోగించుకొని ప్రయాణం చేస్తే ఎక్కిన క్షణం నుంచి గమ్యస్థానం చేరే వరకూ డ్రైవర్ పేరు, ఫోన్ నంబర్, లైసెన్స్ అన్నీ ఆన్లైన్లో నమోదవుతాయి... కాబట్టి తమకు భద్రతపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని మహిళలు చెబుతున్నారు.
సాధారణంగా ఆటో, బస్సు ఛార్జీలతో పోల్చితే వీటి ధర చాలా తక్కువ. చాలీచాలని జీతాలతో ఉద్యోగం చేసే వాళ్లకు సగం శాలరీ... రానుపోను ఛార్జీలకే సరిపోతుంది. వారికి ఈ సేవలు కాస్త ఉపశమనం కల్పిస్తాయి.
సమాజంలో ఆడవారిపై రోజురోజుకు పెరిగిపోతున్న అఘాయిత్యాలు చూస్తుంటే అడుగు బయటపెట్టాలంటేనే భయపడుతున్నారు. బస్సులో కండక్టర్ బుద్ధే సరిగ్గా ఉండటం లేదు.. ఇక బస్సు ఎక్కిన మగాళ్ల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. మరి ఆటోలో వెళ్తుంటే... ముందున్న రోడ్డును చూడటం ఆపేసి వెనుక కూర్చున్న మహిళలను కామంతో చూస్తున్నారు డ్రైవర్లు... ఎక్కడ ఏం చేస్తాడో అని ఆటోలోంచి దూకేసిన మహిళలూ ఉన్నారు. ఇలాంటి సమస్యలన్నింటకి పరిష్కారమే...ఈ బైక్ సేవలు.
ఈ సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన ద్విచక్రవాహన సేవలు... అటు వినియోగదారులు ఇటు డ్రైవర్లకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
ఇదీ చూడండి