WIFE MURDER CASE: ఆమె పాలిట భర్తే యముడయ్యాడు.. తల్లిదండ్రులూ అతడికి సహకరించారు. పెళ్లయిన కొద్దిరోజుల నుంచే భార్యను వేధించడం మొదలుపెట్టిన ఆ ప్రబుద్ధుడు.. అదనపు కట్నం తీసుకురావాలని.. లేదంటే విడాకులు ఇవ్వాలంటూ వేధించి పుట్టింటికి పంపేశాడు. ఆమె ససేమిరా అనడంతో సరే కాపురానికి రమ్మంటూ నమ్మించి తీసుకొచ్చాడు. గుమ్మంలోకి అడుగుపెట్టగానే తల్లిదండ్రులతో కలిసి ఆమెను కొట్టి చంపి మూటకట్టి చెరువులో పడేశాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. తిరుపతి తూర్పు డీఎస్పీ మురళీకృష్ణ మంగళవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. తిరుపతి కొర్లగుంటకు చెందిన తితిదే ఉద్యోగి తిరుమలస్వామి పెద్ద కుమార్తె ఎం.పద్మకు (33) స్థానిక సత్యనారాయణపురానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కె.వేణుగోపాల్‌తో 2019 ఏప్రిల్‌లో పెళ్లి చేశారు. 4 నెలలపాటు చెన్నైలో కాపురం ఉన్న వారు తరచూ గొడవ పడేవారు. తర్వాత తిరుపతికి కాపురం మార్చారు. అక్కడ భర్తతోపాటు ఆర్టీసీ కండక్టరైన మామ పాండురంగాచారి, అత్త రాణి అదనపు కట్నం కోసం వేధించి పుట్టింటికి పంపేశారు.
విడాకులు ఇవ్వాలంటూ వేణుగోపాల్ నోటీసులు పంపాడు. భర్తకు దూరం కావడం ఇష్టంలేని పద్మ కోర్టు వాయిదాలకు వెళ్లలేదు. తన కాపురం చక్కదిద్దాలని 2021లో మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. ఎలాగైనా పద్మను అడ్డు తొలగించుకోవాలని వేణుగోపాల్ కుటుంబం పథకం పన్నింది. జనవరి 5న ఆమె పుట్టింటికి వచ్చిన వేణుగోపాల్ కాపురానికి రమ్మని పిలవడంతో.. నమ్మిన ఆమె అతడితో బయలుదేరింది. ఇంటికి రాగానే పద్మతో భర్త, అత్తమామలు గొడవపెట్టుకున్నారు. వేణుగోపాల్ ఒక చెక్కతో ఆమె తలపై బలంగా కొట్టి చంపేశాడు. మృతదేహాన్ని దుప్పట్లో మూటగట్టారు. బీదర్‌కు చెందిన సంతోష్ అనే స్నేహితుడు, తల్లిదండ్రులతో కలిసి కారులో మృతదేహాన్ని తీసుకువెళ్లి వెంకటాపురం చెరువులో పడేశారు. అక్కడ నుంచి అతడి తల్లిదండ్రులు తీర్థయాత్రలకు బయలుదేరగా.. అతడు హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. భార్యతో కలిసి హైదరాబాద్‌లో జీవిస్తున్నట్లు బంధువులు, పద్మ కుటుంబ సభ్యులను నమ్మించారు. అయితే అప్పటి నుంచి ఆమెతో ఫోన్లో మాట్లాడించకపోవడం, తిరుపతి కోర్టు విచారణకు అతడు ఒక్కడే హాజరు కావడంతో పద్మ తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. వెంకటాపురం చెరువులో మూటను చూపించాడు. పద్మ మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు వేణుగోపాల్‌తోపాటు అతడి తల్లిదండ్రులను అరెస్టు చేశారు. మరో నిందితుడు సంతోష్ కోసం గాలిస్తున్నారు. తనను వేధించిన కారణంగానే పద్మను హతమార్చానంటూ నిందితుడు మీడియాతో పేర్కొనడం విశేషం.
![](https://assets.eenadu.net/article_img/310522ap-crime2B.jpg)
ఇదీ చదవండి: ఐదు నెలల క్రితమే చంపేసి..భార్య తనతోనే ఉందని అత్తామామలను నమ్మించి.. కానీ చివరకు