Tahasunnisa standing in support of street children: అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పది అని పెద్దలు చెప్తూ ఉంటారు. అన్నదానం చేస్తే ఒక్క పూటే కడుపునింపుతుంది. కానీ, విద్యాదానం జీవితాంతం కడుపు నింపుతుందనే సూత్రాన్ని నమ్మి.. బడులకు వెళ్లలేని, వెళ్లని వీధి పిల్లలకు చదువు చెప్తున్నారు తిరుపతికి చెందిన ఓ మహిళ. పిల్లలకు చదువు చెప్పడంతో పాటుగా.. తిరుపతిలోని ఎస్సీ కాలనీ వాసులకు వైద్య, ఆహార అవసరాలను తీరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె చేసే సేవా కార్యక్రమాలు చూసి.. వాటికి సాయంగా నిలుస్తున్నారు మరికొందరు.
చదువుకోవాల్సిన బాల్యంలో ఆట పాటలతో కాలక్షేపం చేస్తున్న పిల్లలకు ప్రతి రోజూ వారి కాలనీకి వెళ్లి చదువు చెప్తున్నారు తహసున్నీసా బేగం. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి చెందిన సాబేగం.. భర్త వృత్తిరీత్యా తిరుపతిలో స్థిరపడ్డారు. కర్నూలులో బీఎస్సీ నర్సింగ్ అభ్యసించిన తహసున్నీసా... ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మానపాడు ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్స్‌గా విధులు నిర్వహించారు. వైద్యుడైన భర్త ఉద్యోగరీత్య తిరుపతిలో స్థిరపడ్డారు. ఉయ్ సపోర్ట్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
కరోనా సమయంలో తిరుపతిలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో పర్యటిస్తూ శానిటైజర్లు, మాస్కులు, భోజనం పంపిణీ చేసేవారు. ఈ క్రమంలో అన్నారావు ఎస్టీకాలనీలో పిల్లలు వీధుల్లో తిరగడం గమనించి వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దాలని భావించారు. పిల్లలకు చదువుపై మక్కువ పెంచడం... మార్పు తీసుకు రావాలన్న తలంపుతో సాయంత్రం వేళల్లో వారి కాలనీలో పాఠాలు చెప్పడం ప్రారంభించారు. విద్యతోపాటు, నీతి కథలు నేర్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నారు.
తహసున్నీసా బేగం చేస్తున్న సేవను గుర్తించిన ఆమె మిత్రులతో పాటుగా.. పలువురు అండగా నిలిచారు. ఆర్థిక సాయం చేయడమే కాకుండా తమ వంతు బాధ్యతగా పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. వారి కుటుంబాల్లో వేడుకలను కాలనీలోని పిల్లలతో కలసి చేసుకుంటున్నారు. సా బేగంతో కలిసి పిల్లలకు సేవ చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె స్నేహితులు తెలిపారు. ఈ కార్యక్రమాల వల్ల తమ పిల్లల బతుకుల్లో గణనీయమైన మార్పు వచ్చిందని కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రేపటి తరానికి విద్యా నేర్పుతూ.. పేద ప్రజలకు ఆరోగ్య, ఆర్థిక పరంగా అండగా ఉండటంలోనే సంతృప్తి ఉందంటూ ఎంతో మందికి సూర్తిగా నిలుస్తున్నారు తహసున్నీసా బేగం.
ఇవీ చదవండి: