రెండేళ్ల తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనడంతో.. కొండంత జనం తిరుమల శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు. గరుడ సేవ, వైకుంఠ ఏకాదశి రోజుల్లో తిరుమలకు తరలివచ్చిన రీతిలో భక్తులు సర్వదర్శనానికి వస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు రెండు నిండి కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. గతంలో ఎన్నడూ లేనిరీతిలో సర్వదర్శన క్యూలైన్లు వెంగమాంబ అన్నదాన సత్రం దాటిపోయింది. సర్వదర్శానికి క్యూలైన్లలోకి నారాయణగిరి ఉద్యాన వనం ప్రాంతంలో భక్తులను అనుమతిస్తారు. భక్తుల రద్దీ పెరిగిపోతుండటంతో వెంగమాంబ అన్నదాన సత్రం సమీపం నుంచి భక్తులను క్యూలైన్లలోని అనుమతిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఉన్న 32 కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో పాటు నారాయణగిరి ఉద్యానవనాల్లో నిర్మించిన షెడ్లలో సైతం భక్తులు నిండిపోయారు.
తితిదే అధికారుల అంచనాలకు మించి భక్తులు పోటెత్తుతున్నారు. టోకెన్ల జారీ విధానాన్ని తితిదే రద్దు చేయడంతో స్వామివారి దర్శనానికి భక్తులు నేరుగా వస్తున్నారు. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో అప్రమత్తమైన తితిదే జాగ్రత్తలు చేపట్టింది. క్యూ లైన్ల వద్ద స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు, చంటిపిల్లలు ఇబ్బందులుపడకుండా అల్పాహారం, నీరు, పాలు పంపిణీ చేస్తున్నారు.
తిరుమల చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా భక్తులు తరలివస్తున్నారని తితిదే ఈవో ధర్మారెడ్డి చెప్పారు. శ్రీవారి సర్వ దర్శనానికి రెండు రోజుల సమయం పడుతోందని.. భక్తులు రద్దీ దృష్ట్యా మూడు రోజుల పాటు బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నామని ప్రకటించారు.
రద్దీ ఎక్కువగా ఉన్నందున.. కొంత ఆలస్యమైనా పర్వాలేదనే దృష్టితో భక్తులు తిరుమలకు రావాలని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. వేసవి సెలవుల కారణంగా రద్దీ అనూహ్యంగా పెరిగిందన్నారు. ఈ పరిస్థితుల్లో భక్తులు తితిదేకి సహకరించాలని కోరారు. దేవస్థానం తరఫున భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
సాధారణ రోజులతో పాటు వారాంతాల్లో రద్దీ..మరింత అధికమవుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా బ్రేక్ దర్శనాలు రద్దు చేసినా.. అధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో.. శ్రీవారి దర్శనం కోసం గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది.
ఇవీ చదవండి:
మహిళలను రాత్రుళ్లు పనిచేయమని ఒత్తిడి చేస్తున్నారా?.. ఇక కష్టమే!
'ఆ సమయానికి యుద్ధం మొదలుపెడదాం'..వాట్సప్ సందేశంతో అమలాపురం విధ్వంసకాండ
ఎన్టీఆర్ శతజయంతి.. అంతర్జాతీయ స్థాయిలో క్యారికేచర్, కవితల పోటీలు