CM Jagan opening development works: తిరుపతి జిల్లాలో పలు పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. శ్రీకాళహస్తిలోని ఇనగళూరులో అపాచీ పరిశ్రమకు భూమిపూజ చేశారు. 10 వేల మందికి ఉపాధినిచ్చే ఈ పరిశ్రమ 15 నెలల్లో అందుబాటులోకివస్తుందని తెలిపారు. ఈ పరిశ్రమ రాకతో ఇనగళూరు రూపురేఖలు మారిపోతాయని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇనగలూరు నుంచి వికృతమాలకు చేరుకున్న సీఎం.. ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్-1లో 3 పరిశ్రమలను ప్రారంభించారు. మరో 2 పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. టీసీఎల్ ద్వారా 2 వేల మందికి ఫాక్స్ లింగ్ ద్వారా 2 వేల మందికి, సన్నీ ఆప్కోటెక్ ద్వారా 3 వేల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం చెప్పారు. ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్తలతో సమావేశమైన జగన్ అండగా ఉంటామని యాజమాన్యాలకు భరోసా ఇచ్చారు.
ఇనగళూరులో సీఎం పర్యటన కోసం వైకాపా నేతలు జనాన్ని భారీగా సమీకరించారు. ఐతే శంకుస్థాపన ప్రాంతానికి అనుమతి లేకపోవడంతో వారంతా ఎండలో నిలబడి అవస్థలు పడ్డారు. సీఎం రాక ముందే చాలా మంది వెనుదిరిగారు. జగన్ పర్యటన దృష్ట్యా విపక్ష నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. చంద్రగిరిలో తెదేపా, శ్రీకాళహస్తిలో జనసేన, తిరుపతిలో సీఐటీయూ నేతలను ఇళ్ల నుంచి బయటకు వెళ్లనీయలేదు.
ఉదయం వకుళామాత ఆలయ మహాసంప్రోక్షణలో సీఎం జగన్ పాల్గొన్నారు. సీఎం జగన్‌కు పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం వకుళామాత ఆలయ నిర్మాణ విరాళదాతలను జగన్ సన్మానించారు. మహా సంప్రోక్షణలో సీఎంతో పాటు మంత్రి పెద్దిరెడ్డి దంపతులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి