YSRCP Government Cheated the Residents of Mulapeta Port : శ్రీకాకుళం జిల్లా మూలపేట వద్ద పోర్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన నిర్వాసితుల్ని ప్రభుత్వం నిలువునా వంచించింది. పోర్టు నిర్మాణానికి భూములిస్తే కోరినంత పరిహారం అంటూ గ్రామ సభల్లో ప్రభుత్వాధికారులతో కలిసి మంత్రులు, వైసీపీ ప్రజాప్రతినిధులు అరచేతిలో స్వర్గం చూపించారు.
Government not Giving Compensation to Mulapeta Farmers : శ్రీకాకుళం కలెక్టర్, మంత్రి సీదిరి అప్పలరాజు, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అనేక హామీలు ఇచ్చారు. భూములు ఇచ్చేంత వరకూ వెంటపడి.. ఇప్పుడు ముఖం చాటేస్తున్నారంటూ ఇటీవలే మూలపేట రైతులు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను నిలదీశారు. ఆయన మాత్రం తానెలాంటి హామీ ఇవ్వలేదంటూ బుకాయించారు. మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో ఒక్కో జీడి మామిడి చెట్టుకు 5 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని నమ్మబలికి.. చివరకి 2వేల 500 మాత్రమే ఇచ్చారు. అది కూడా అన్ని చెట్లకు కాకుండా కొందరు రైతులకే చెల్లించారు.
Mulapeta Farmers Fire on MLC Duvwada Srinivasa Rao : ఇక తాత్కాలికంగా వలస వెళ్లిన వారినీ నిర్వాసితులుగా గుర్తిస్తామని వైసీపీ ప్రజాప్రతినిధులు అప్పట్లో హామీ ఇచ్చారు. ఐతే తాత్కాలికంగా వలస వెళ్లిన వారిలో కేవలం 36 మందినే నిర్వాసితుల జాబితాలో చేర్చారు. వారికీ ఇంకా పరిహారం అందించలేదు. కటాఫ్ తేదీ నాటికి 18 ఏళ్లకు ఒకటి, రెండు నెలలు తక్కువ వయసు ఉన్నప్పటికీ వారినీ నిర్వాసిత కుటుంబంగా గుర్తించి ప్యాకేజీ ఇస్తామని నమ్మబలికారు. నైపుణ్యం ఉన్న యువకులకు పోర్టులో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు చెప్పిన వారికి తప్ప నిజంగా భూములు త్యాగం చేసిన వారికి న్యాయం జరగడం లేదని అంటున్నారు.
ఇక నిర్వాసితులకు ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తుందని అన్నారు. కానీ నిర్వాసితులకు ఇచ్చిన ప్యాకేజీ నుంచే ఇంటి నిర్మాణానికి మూడున్నర లక్షలు భరించాలని ప్లేటు మార్చారు. అంత తక్కువ మొత్తంతో ఇల్లు ఎలా కట్టుకోగలమని, ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని ఏప్రిల్ 24న సీఎం జగన్ మోహన్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చినా ఫలితం లేదు.
పోర్టు నిర్మిత గ్రామాల్లోని ప్రభుత్వోద్యోగులకూ నిర్వాసితుల తరహాలో ప్యాకేజీ అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. కానీ సాధారణ వ్యక్తుల కుటంబానికి 9లక్షల 90 వేల చొప్పున పరిహారం ఇవ్వగా, ప్రభుత్వ ఉద్యోగులకు కేవలం 4లక్షల 41 వేల రూపాయలతో సరి పెట్టారు. పోర్టు కోసం సర్వస్వం త్యాగం చేసి.. మోసపోయామని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"జీడిమొక్కకి 5 వేల రూపాయలు ఇప్పిస్తామని, ఎమ్మెల్సీ, పోర్టు ఎండీ ప్రజలను నమ్మించి జీడి తోటను కొట్టించారు. ఈరోజు మా గ్రామస్థులకు ఏమి లేకుండా చేశారు. రైతు కూలీలుగా పని చేస్తామన్నా కుదరనివ్వడం లేదు. మాకు అవకాశాలు ఇవ్వకుండా వాళ్ల అనుచరులకి పోర్టులో ఉద్యోగాలు ఇప్పించారు. మాకు అన్యాయం జరుగుతోంది. మాకు అన్యాయం చేసి.. ఎమ్మెల్సీ మా గొంతు కోశారు." బాబూరావు, మూలపేట సర్పంచ్
గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్ గ్రామసభలో రైతుల గందరగోళం.. చెక్కుల పంపిణీ నిలిపివేత