AP High Court: వృద్ధులకు ఆర్టీసీ బస్సులు, రైలు ఛార్జీలలో రాయితీని ఎందుకు పునరుద్ధరించలేదో చెప్పాలని రైల్వేబోర్డ, ఆర్టీసీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. కొవిడ్ సమయంలో రద్దు చేసిన రాయితీలను... తీవ్రత తగ్గాక కూడా ఎందుకు అమలు చేయడంలేదని మండిపడింది. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం ఏమిటో చెప్పాలని స్పష్టంచేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ప్రశాంతకుమార్ మిశ్రా, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. రైలు, బస్సు ఛార్జీల్లో వృద్ధులకు ఇచ్చే రాయితీని కొవిడ్ కారణంగా రద్దు చేశారని, సాధారణ పరిస్థితులు వచ్చినా రాయితీ పునరుద్ధరించలేదని పేర్కొంటూ శ్రీకాకుళానికి చెందిన జీఎన్ కుమార్ హైకోర్టులో పిల్ వేశారు.
న్యాయవాది పీపీఎన్ఎస్ శ్రీకాంత్ వాదనలు వినిపిస్తూ పలువురి విషయంలో రాయితీని పునరుద్ధరించినా వృద్ధుల విషయంలో జరగలేదన్నారు. ఈ తరహా చర్య వివక్ష చూపడమేనన్నారు. ఛార్జీల్లో రాయితీ ఇస్తే వృద్ధులకు కొంత అసరాగా ఉంటుందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ వృద్ధులు సులువుగా కొవిడ్ బారినపడతారు కాబట్టి ప్రయాణాల సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వం రాయితీని నిలిపేసిందని పేర్కొంది. ప్రస్తుతం కరోనా పరిస్థితులు మెరుగుపడిన నేపథ్యంలో రాయితీని ఎందుకు పునరుద్ధరణ చేయలేదో చెప్పాలని అధికారులను ఆదేశిస్తూ విచారణను... ఈనెల 29 కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: లేఅవుట్లలో 5 శాతం ఇవ్వాలన్న నిర్ణయంపై హైకోర్టులో విచారణ...