కేంద్ర ప్రభుత్వం శుక్రవారం దేశవ్యాప్తంగా 47మందికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కాశీబుగ్గ పాఠశాల ఉపాధ్యాయుడు అసపాన మధుబాబు, తెలంగాణ నుంచి హైదరాబాద్ మలక్‌పేటలోని నెహ్రూ మెమోరియల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయిని పద్మప్రియలకు ఈ అవార్డు దక్కింది. ఏపీ నుంచి ఆరుగురి పేర్లను ప్రతిపాదించగా మధుబాబు ఎంపికయ్యారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 153మందిని వీడియో కాన్ఫరెన్సు ద్వారా పరిశీలించిన జ్యూరీ చివరికి ఈ 47మందిని ఎంపిక చేసింది. మధుబాబు కాశీబుగ్గ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఆంగ్లం బోధిస్తుంటారు.
తరగతి గదిలోకి వస్తున్నారంటే విద్యార్థులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అందుకు కారణం ఆయన విద్యార్థులకు అర్థమయ్యేలా వినూత్నరీతిలో ఆహ్లాదకరంగా పాఠాలు బోధించడమే. ఆయన సొంతంగా డిజిటల్ ల్యాబ్ ఏర్పాటు చేసి, విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించేలా కృషి చేస్తున్నారు. ఆయన పలు సామాజిక సేవా కార్యక్రమాల్లోను తనదైన పాత్ర పోషిస్తున్నారు. నందిగాం మండలం కాపుతెంబూరుకు చెందిన మధుబాబు తండ్రి శ్రీరాములు కూడా ఉపాధ్యాయుడే. తండ్రిని ఆదర్శంగా తీసుకొని ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. 1995లో వజ్రపుకొత్తూరు మండలం ఒంకులూరు ప్రాథమిక పాఠశాలలో చేరిన ఆయన 2002లో స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. గత ఐదేళ్లుగా ఆంగ్ల ఉపాధ్యాయుడిగా కాశీబుగ్గలోనే పనిచేస్తున్నారు. 2014లో జిల్లా, 2015లో రాష్ట్ర స్థాయిలోను ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డులు అందుకొన్నారు.
ఈ అవార్డు మరింత బాధ్యత పెంచింది
ఈ అవార్డు నాపై మరింత బాధ్యత పెంచింది. ఇప్పటివరకు విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో బహుమతులు పొందారు. వారిని జాతీయస్థాయికి తీసుకెళ్తాను. ప్రతీ తరగతి గది డిజిటల్‌గా మార్చడానికి కృషి చేస్తాను. విద్యార్థులు ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడేలా తయారు చేయడానికి కృషి చేస్తాను.
- ఆసపాన మధుబాబు, జాతీయ అవార్డు గ్రహీత, కాశీబుగ్గ
ఇవీ చదవండి: వినాయకచవితి పై 'ఈటీవీ భారత్' ప్రత్యేక కథనం