తెదేపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కళా వెంకటరావును బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకొని వదిలేసిన నేపథ్యంలో.. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆయనను పరామర్శించారు. తెదేపా పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జ్ కూన రవికుమార్.. శ్రీకాకుళం జిల్లా రాజాంలోని వెంకటరావు క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిశారు. ఆలయాలపై దాడులు చేసిన వారిని, రాముని విగ్రహం తల తీసిన వారిని విడిచిపెట్టి.. తెదేపా నాయకులపై కక్ష సాధింపు తగదని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర ట్రంప్ సీఎం జగన్ని ప్రజలు ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబునాయుడు పోలీసులు అనుమతితో రామ తీర్థానికి వస్తే రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. ప్రజలు చెప్పులతో, వాటర్ బాటిళ్లతో కొడుతూ.. తిరుగుబాటు చేయడం మొదలు పెట్టారని గుర్తు చేశారు. పాలన ఇలాగే సాగితే భవిష్యత్తులో రాళ్లు విసిరే రోజులు వస్తాయని హెచ్చరించారు.
సీఎం జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని.. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పోలిట్బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. కళా వెంకటరావు అరెస్టుకు నిరసనగా.. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ప్రతిపక్షాలను భయపెట్టడం ద్వారా.. ఉన్న కొన్ని రోజులైనా ప్రభుత్వాన్ని నడపాలని ప్రతిపక్ష పార్టీ నేతలపై వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుతో పాటు రామతీర్థానికి వెళ్లడమే కళా వెంకటరావు చేసిన తప్పా అని ప్రశ్నించారు. చంద్రబాబు పర్యటన కొనసాగకుండా ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించాలనే కుట్రతోనే విజయసాయిరెడ్డి అదేరోజు రామతీర్థాన్ని సందర్శించారని ఆరోపించారు. ఆయన కారుపై ఎవరో నీళ్ల బాటిళ్లు విసిరితే.. ఆ నెపాన్ని చంద్రబాబు, వెంకట్రావుపై వేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం దారుణమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కళా వెంకటరావును అదుపులోకి తీసుకుని వదిలేసిన పోలీసులు