శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పురపాలక సంఘం పార్వతీశంపేటలో ఇటీవల కొందరు వ్యక్తులు.. తెదేపా నాయకుడు మోహన్రావు ఇంటిపై దాడి చేశారు. దీనిపై విచారణ చేపట్టి.. ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు ఆమదాలవలస ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు.
వైకాపా అధికారంలోకి వచ్చాక ఆమదాలవలసలో రౌడీయిజం పెరిగిపోయిందని.. తెదేపా నేత కూన రవికుమార్ మండిపడ్డారు. తెదేపా నాయకులు ఇంటిపై దాడులు చేస్తున్న పోలీసులు ఎందుకు పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు.. వైకాపా నేతలకు కొమ్ములు కాస్తున్నారని విమర్శలు సంధించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం అనుచరులే.. ఈ దాడి చేయించారని ఆరోపణలు చేశారు. మోహన్రావు ఇంటిపై 20 మందికి పైగా దాడి చేస్తే.. కేవలం ఎనిమిది మందినే అదుపులోకి తీసుకున్నారని పోలీసులపై ధ్వజమెత్తారు. మిగిలిన వారిని ఎందుకు అరెస్టు చేయాలని అడిగితే పరారీలో ఉన్నారని.. సాకులు చెబుతున్నారని అన్నారు. తక్షణమే దాడి చేసిన వారందరిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: గ్రూప్-1 ఇంటర్వ్యూ ప్రక్రియపై స్టే ఇస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు