కరోనా మృతుల అంత్యక్రియలను చేసేందుకు కుటుంబ సభ్యులే పట్టించుకోకపోయినా, స్థానికులు సహాయపడకపోయినా పారిశుద్ధ్య కార్మికులే మేమున్నామంటూ ముందుకొస్తారు. అన్నీ తామై ఇంట్లో వ్యక్తుల్లాగా దహనసంస్కారాలు నిర్వహిస్తారు. అలాంటివారిని కరోనా అపోహలతో వీధిలోని రానివ్వలేదు స్థానికులు. మావీధిలోకి వస్తే కరోనా వస్తుందని.. వారిని అంటరానివారిలా చూసారు. చేసేదిలేక వారు మూడురోజుల నుంచే ఓ అరుగుపైనే తలదాచుకుంటున్నారు.
శ్రీకాకుళం జిల్లా.. టెక్కలిలో కరోనాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలు చేసిన పారిశుద్ధ్య కార్మికులు కష్టాలు అనుభవిస్తున్నారు. వీరిని స్థానికులు వీధిలోకి రానివ్వలేదు. వారు అప్పటినుంచి మూడు రోజులుగా స్థానిక అంబేద్కర్ భవన్ అరుగు పైనే తలదాచుకుంటున్నారు. మూడు రోజుల క్రితం మెళియాపుట్టి మండలంలో కరోనాతో మృతి చెందిన రోగిని ఖననం చేసే కార్యక్రమంలో అధికారుల సూచనమేరకు టెక్కలికి చెందిన ఇద్దరు, సంతబొమ్మాళి మండలానికి చెందిన నలుగురు కార్మికులు పాల్గొన్నారు. పీపీఈ కిట్లు ధరించి పాల్గొన్నప్పటికీ స్థానికులు అపోహలతో.. వీరిని దూరం పెట్టారు.
దీంతో పోలీసులు వీరిని అంబేద్కర్ భవనానికి తరలించారు. మూడు రోజులుగా తమకు ఆహారం అందడం లేదని, దాహంతో అలమటిస్తున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తంచేశారు. విషయం తెలుసుకున్న టెక్కలికి ఎస్సై గణేష్ ఈ సమస్యను.. ఆర్డీవో ఈట్ల కిశోర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వీరిని స్థానికంగా ఉన్న వసతి గృహానికి తరలించారు.