శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నెలివాడ కూడలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నెలివాడకు చెందిన 11 మంది, సమీపంలోని పెసరపాలెం గ్రామానికి వ్యవసాయ కూలీ పనుల నిమిత్తం వెళ్లారు. పనులు ముగించుకుని ఆటోలో సాయంత్రం స్వస్థలాలకు బయలుదేరారు. అంతలోనే వారు ప్రయాణిస్తున్న ఆటోను ఓ ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. దాంతో ఆటో డ్రైవర్‌తో పాటు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 10 మంది మహిళలున్నారు.
సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై శ్రీనివాసరావు ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బాధితులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడం వల్ల నెలివాడలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చదవండి: