శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆదిత్యునికి మహాక్షీరాభిషేక సేవ నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చారణలు, మంగళధ్వనులతో సూర్యదేవుడికి మహా క్షీరాభిషేకం చేశారు. విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి.. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి.. తొలి పూజ చేశారు. వేడుకల్లో శాసన సభాపతి తమ్మినేని సీతారాం, ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ నివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ నిర్వహణలో అర్చక స్వాములు సూర్యభగవానునికి క్షీరాభిషేకం చేశారు. దేవాదాయశాఖ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అరసవల్లి భాస్కరుని ఆలయం.. దేశంలోనే ప్రసిద్ధి చెందింది. ఏటా మాఘశుద్ధ సప్తమి.. రథసప్తమి.. వెలుగులరేడుకు జన్మదినోత్సవం. ఈ అరుదైన వేడుకను కనులారా తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇది మహాపర్వదినం. సకలకోటికి ఆనంద దినం. స్వామివారి ఏకశిలపై క్షీరాభిషేకం వీక్షించే అరుదైన దృశ్యం భక్తులకు ఆనందభరితం. అరసవల్లి సూర్యనారాయణస్వామి నిజరూప దర్శనంతో మనోభీష్టాలు కలుగుతాయని నమ్మకం. అందుకే ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది.
ఇంద్రపుష్కరిణి ఆవరణ భక్తులతో కిటకిటలాడుతోంది. క్షీరాన్నం ప్రసాదాన్ని తయారు చేసి సూర్య దేవునికి నైవేద్యం సమర్పించారు. ఆనవాయితీగా వస్తున్న పూజలను చేస్తూ.. వెలుగులరేడు.. సూర్యనారాయణ స్వామికి ఇంద్రపుష్కరిణి వద్ద ప్రార్థనలు చేస్తున్నారు. ఆదిత్యుని ఆలయాన్ని పుష్పాలతో, రంగు రంగుల విద్యుద్దీపాలతో అలంకరించి వెలుగుల రేడుకు.. వెలుగు పూల తోరణాలు కట్టారు. ముఖద్వారం ద్వారా దర్శనం ఏర్పాట్లు చేశారు. అర్ధరాత్రి నుంచే భక్తుల హడావిడి ప్రారంభమైంది.
తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అరసవల్లికి చేరుకున్నారు. స్వామి వారి నిజరూప దర్శనానికి రాత్రి నుంచే క్యూలైన్లలో నిల్చొని బారులు తీరారు. పోలీసుల పటిష్ట భద్రత మద్య ఈ వేడుకలు జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రసాదాల కోసం లడ్డూ.. పులిహోర తయారు చేశారు. గతేడాది లాగే ప్రత్యేక దర్శనానికి ఐదు వందల టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి.. విస్తృతంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీటి సౌకర్యం కల్పించారు.