శ్రీకాకుళం జిల్లాలో పుష్కలమైన సాగునీటి వనరులున్నా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. పనుల్లో నాణ్యత లోపం కారణంగా సాగునీరు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ కోవలోకే వస్తుంది నారాయణపురం ఆనకట్ట. నాగావళి నదిపై 60 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ప్రాజెక్ట్ శిథిలావస్థకు చేరుకుంది. దీనికింద 7 మండలాల పంటపొలాలకు నీరందుతుంది. గత తెదేపా ప్రభుత్వం నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణకు ముందుకువచ్చింది. జైకా(జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ) కింద నిధులు మంజూరు చేసింది. దీంతో ఆనకట్ట బాగుపడుతుందని.. సాగునీటి కష్టాలు తీరతాయని రైతులు ఆశపడ్డారు. అయితే ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్ పనులు 4 శాతం మాత్రమే పూర్తయ్యాయి.
నత్తనడకన పనులు
నారాయణపురం ఆనకట్ట ఆయకట్టు పరిధిలోని 92 గ్రామాల్లో 37వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. దీని ఆధునికీకరణ పనులు గతేడాది ప్రారంభించారు. 2020 ఆగస్టు చివరికి పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే పనుల్లో వేగం కనిపించడంలేదు. ఇప్పటికీ కేవలం 4 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు కుడి, ఎడమ కాలువల పూడికతీత, మట్టి పనులు మాత్రమే చేపట్టారు. ఇంతలో ఖరీఫ్ సీజన్ మొదలవటంతో పనులు ఆపి నీరు విడుదల చేశారు.
అధికారుల తీరుతో ఆలస్యం
ఆనకట్ట పునర్నిర్మాణం కోసం 1999 సంవత్సరం జూన్ 12వ తేదీన అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. అలాగే 2003 నవంబర్ ఆరో తేదీన ఆధునీకరణ పనుల కోసం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేసారు. మళ్లీ తెదేపా ప్రభుత్వంలో జైకా నిధులను సమకూర్చారు. దీంతో మంత్రులు కిమిడి కళావెంకట్రావు, కింజరాపు అచ్చెన్నాయుడు 2019 సంవత్సరం ఫిబ్రవరి 19 తేదీన శుంకుస్థాపన చేశారు. ఇప్పుడు వైకాపా ప్రభుత్వమూ పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేసేందుకు శ్రీకారం చుట్టింది.
అయితే అధికారులు తీరుతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆనకట్ట నుంచి నీరందక వర్షం కోసం అన్నదాతలు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.
ఇవీ చదవండి...