కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా రైతులు నష్టపోతున్నారు. వీరికి చేయూతనందించేందుకు ప్రభుత్వాలు నడుం బిగించాయి. కేంద్రప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద నిధులు సమకూర్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. పీఎంకిసాన్- వైఎస్‌ఆర్ రైతు భరోసా కింద గుర్తించిన లబ్ధిదారులందరికీ బ్యాంకు ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేసేందుకు చర్యలు చేపట్టాయి.
శ్రీకాకుళం జిల్లాలో లక్షల మంది రైతులకు కొంత ఆర్థిక వెసులుబాటు లభించనుంది. ఏటా మేలో సమకూర్చాల్సిన నిధులను నెల ముందుగానే ప్రభుత్వాలు జమ చేస్తున్నాయి. రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.2 వేలు చొప్పున జమ చేసేవిధంగా చర్యలు ముమ్మరమయ్యాయి. ఈ నెల 15వ తేదీ నాటికి ప్రక్రియ పూర్తి చేసేవిధంగా ప్రణాళిక రూపొందించాయి. పీఎం కిసాన్ పథకం కింద ఏటా 3 విడతల్లో కేంద్ర ప్రభుత్వం రూ.6 వేలు సమకూర్చుతోంది. వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 సమకూర్చుతోంది. మొత్తంగా ఏడాదికి 3 విడతల్లో రూ.13,500 చొప్పున రైతుల ఖాతాలకు జమచేసే విధంగా పథకానికి రూపకల్పన చేశారు.
గతంలో పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు మంజూరు చేసేది. అయితే వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకంలో దీన్ని అనుసంధానం చేసి రైతులకు అందజేస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నిధులు జమ చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 46 లక్షలమంది రైతులకు రూ.920 కోట్లు ప్రస్తుతం విడుదలైంది. ఇందులో భాగంగా ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లాలోని 2.44 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని అంచనా వేస్తున్నప్పటికీ ఈ సంఖ్య పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
కౌలు రైతులకూ లబ్ధి
వైఎస్‌ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం కింద కౌలు రైతులకు లబ్ధి కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నిజానికి పీఎం కిసాన్ పథకంలో భాగంగా కౌలు రైతులను పరిగణనలోకి తీసుకోవడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా వీరిని గుర్తించి ఆర్థిక సాయం అందజేస్తూ వస్తోంది. పీఎం కిసాన్ పథకంలో భాగంగా ఇంతవరకు 4 విడతల్లో నిధులు సమకూరాయి. రూ.212.65 కోట్ల మేర ఆర్థిక లబ్ధి కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పీఎం కిసాన్- వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకంగా మార్చి కౌలు రైతులకు అవకాశం కల్పించటంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయినా ఇంకా చాలామంది అర్హులకు పథకంలో చోటు దక్కలేదన్న ఆందోళన వ్యక్తమవుతున్నాయి. వీరికీ న్యాయం జరిగేలా చూస్తున్నారు. ఇటీవల 5 వేల మంది వరకు అర్జీలు చేసుకున్నారు. రియల్‌టైం గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) నుంచి ఆయా జాబితాలు వెలువరించిన వివరాలు వ్యవసాయాధికారులు క్షుణ్నంగా పరిశీలించి 4,360 మందిని అర్హులుగా తేల్చి ప్రతిపాదించారు. వీరికి కూడా నిధులు మంజూరైతే మరో రూ.87.20 లక్షలు సమకూరుతాయని అంచనా వేస్తున్నారు.
గాబరా పడవద్దు
'బ్యాంకు ఖాతాల నుంచి నిధులు తీసుకునేందుకు రైతులు గాబరా పడవద్దు. బ్యాంకు ఖాతాలకు జమ చేసిన నిధులు ఎప్పుడైనా తీసుకొనే వెసులుబాటు ఉంటుంది. అందరూ ఒకేసారి బ్యాంకులకు వెళ్తే రద్దీ నెలకొంటుంది. బ్యాంకు కరస్పాండెంట్లు, ఏటీఎంలు, ఇతరత్రా మార్గాల్లో నిధులు తీసుకోవాలి. అందరూ భౌతిక దూరం పాటించడం తప్పనిసరి.' - కె.శ్రీధర్, వ్యవసాయశాఖ జేడీ, శ్రీకాకుళం
ఇవీ చదవండి: