MINISTER DHARMANA ON ELECTIONS : 2024లో జరిగే ఎన్నికల్లో చంద్రబాబుకు మహిళలు ఎవరూ ఓట్లు వేయ్యరని.. ఒకవేళ వేస్తే వాళ్ల చేతులను వాళ్లే నరుకున్నట్లు అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. మహిళా సంఘాల అప్పులు చంద్రబాబు కట్టలేదన్న ధర్మాన.. విడత విడతలుగా కడతామని ఇచ్చిన హామీలను జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకుంటున్నారన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం రాగోలులో నిర్వహించిన ఆసరా పథకం నిధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన.. 2024లో చంద్రబాబుకు ఓటేస్తే ఇప్పుడిస్తున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయని.. ప్రజలను హెచ్చరించారు. ఐతే ప్రసంగం మధ్యలో మహిళలు వెళ్లిపోవడాన్ని గమనించిన మంత్రి.. ఐదు నిమిషాల్లో సభ ముగుస్తుందంటూ వారిని ఆపే ప్రయత్నం చేశారు.
మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. "మాకు చాలా బలమైన గ్రామాలు ఉన్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ గ్రామాల్లో మాకు మెజార్టీ వస్తుంది. పాత్రునివలస, చాపారం, లంకాం, వాకాలపాడు, రాగోలు ,పెద్దపాడు అన్ని గ్రామాలు మాకు బలమైనవి. ప్రతి సమస్యను మేము పరిష్కరించే పని చేస్తూనే ఉన్నాం. మీ సహకారం ఎప్పుడూ వైసీపీకి ఉండాలని కోరుకుంటున్నా" అని వ్యాఖ్యానించారు.
"మహిళలు అనే వాళ్లు ఎవరూ చంద్రబాబుకి ఓటు వెయ్యరు. వేస్తే వాళ్ల చేతులను నరుక్కున్నట్లే. సంక్షేమ పథకాలను ఇవ్వాలంటే ఆ వ్యక్తికి మనం అధికారం ఇవ్వాలి. ఆ అధికారం ఇచ్చే శక్తి మన అందరికీ ఉంది. మనం అధికారం ఇస్తేనే.. అతను మనకి తిరిగి ఇవ్వగలడు. 2019లో మీరు ఇచ్చిన అధికారం వల్లనే ఈరోజు మీ అంకౌట్లలో డబ్బులు పడుతున్నాయి. సంవత్సరం తర్వాత ఇవి ఆగిపోతాయి. హే తల్లి హే.. మీటింగ్ అయిపోయింది. వెళ్లిపోదూరు కానీ ఆగండి. ఇంకో ఐదు నిమిషాల్లో మీటింగ్ అయిపోద్ది"-ధర్మాన ప్రసాదరావు, మంత్రి
నిన్న శ్రీకాకుళంలో జరిగిన ఆసరా నగదు పంపిణీ కార్యక్రమానికి వచ్చిన మహిళలు గోడలు దూకి వెళ్లిపోతున్నారనే ప్రచారం అవాస్తవమని.. మిగతా వాళ్లని మభ్యపెట్టడానికే అని మంత్రి ధర్మాన ఆరోపించారు. రాష్ట్రంలో స్త్రీలు సంతోషంగా ఉన్నారని.. దానికి కారణం కేవలం వైసీపీ, జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని ఆయన తెలిపారు. ఈ అధికారాన్ని వదులుకుంటే మహిళలు బలహీనులవుతారని వ్యాఖ్యానించారు. కేవలం ఓటు అనే అధికారం ద్వారానే ఉండటమా.. లేదా తీసేయటమా అనేది తెలిసిద్దని.. తీసేయటమే జరిగితే అధికారాన్ని మహిళలు కోల్పోతారని వివరించారు. ఈ విషయం చాలా మంది మహిళలకు తెలియడం లేదని.. తెలిసిన మహిళలు తెలియనివారికి చెప్పండని సూచించారు. మహిళలు ఓటు వేయడానికి భర్త, కుమారుడితో గొడవలు పడొద్దని.. ఎవరికి ఓటు వేయాలనిపిస్తే వారికే వేయండని మహిళలకు సూచించారు.
అయితే చాలా మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని.. కాకపోతే చాలా మందికి అవగాహన లేక వైసీపీ గుర్తుని సైకిల్ అంటున్నారని.. అలాంటి వారికి చైతన్యం కలిగించాలని కోరుకుంటున్నట్లు ధర్మాన తెలిపారు. ఒకవేళ 2024ఎన్నికల్లో వైసీపీ గెలవకపోతే మీ సంక్షేమ పథకాలు మళ్లీ ఆగిపోతాయని మహిళలను హెచ్చరించారు.
ఇవీ చదవండి: