శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీవో ఎన్వీ రమణ సమావేశమయ్యారు. బాధితుల గుర్తింపు, నమూనా సేకరణ, తక్షణ వైద్యసేవలు అందించడం ద్వారా కరోనా మరణాలని నియంత్రించగలమన్నారు. 21వ తేదీ నుంచి అమలుచేయనున్న లాక్డౌన్ అమలుపై మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, మండల అధికారులతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు.
21వ తేదీ నుంచి ఉదయం 6 గంటన నుంచి 11 గంటల వరకు నిత్యావసర, కూరగాయలు, చికెన్, మటన్, చేపలు వ్యాపారాలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తెరవటానికి అనుమతి ఉన్నట్లు తెలిపారు. మిగిలిన వ్యాపారాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పాలు, మెడికల్ షాపులు 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా సూపర్ మార్కెట్లు తెరవకుండా ఫోన్ ఆర్డర్ ద్వారా సరకులు డోర్ డెలివరీ చేసుకోవచ్చని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బయటకు వచ్చే వారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని స్పష్టం చేశారు. 11 గంటల తర్వాత జన సంచారం నిషేధమనీ... ఎవరైనా నిబంధనలు మీరితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 4,074 కరోనా కేసులు, 54 మరణాలు