శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లావేరు, వెంకటాపురం, గోవిందపురం ఫీడర్ల పరిధిలో ఉన్న రైతన్నలు విద్యుత్ సబ్ స్టేషన్ను ముట్టడించారు. వ్యవసాయానికి రాత్రిపూట 12 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు విద్యుత్ సరఫరా ఇవ్వడంతో పంటకు నీరు పెట్టలేని పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. అర్ధరాత్రి వేళల్లో అడవి జంతువులు, విషసర్పాలు ఇబ్బందులు పెడుతున్నాయని ఆవేదన చెందుతున్నారు.
గతంలో రబీ సాగుకు పగటిపూటే నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశారని...ఇప్పుడు మార్చడానికి గల కారణాలు ఏమిటని అధికారులను నిలదీసారు. విద్యుత్ అధికారులు అక్రమ కనెక్షన్దారులతో... కలిసి మోసగిస్తున్నారని అన్నదాతలు ఆరోపించారు. విద్యుత్ సరఫరా సక్రమంగా ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలకు విద్యుత్ సరఫరా లేక సాగునీరు అందించలేకపోతున్నామని వాపోతున్నారు.
ఒక వారం పగటిపూట మరో వారం రాత్రివేళల్లో వ్యవసాయానికి సరఫరా అందిస్తున్నాం. మండలంలో వ్యవసాయ పంపుసెట్లకు సంబంధించి 3058 కనెక్షన్లు ఉన్నాయి. ట్రాన్స్ ఫార్మర్లపై లోడు ఎక్కువగా పడటం వలన సరఫరా వేళల్లో మార్పులు చేయడం జరిగింది. ఈ సమస్యని తీర్చడానికి ఉదయం 3నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తున్నాము. కెపాసిటీ సరిపడకపోవడంతో ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లడం జరిగింది. ట్రాన్స్ ఫార్మర్లు వచ్చిన వెంటనే సమస్య పరిష్కరిస్తాం.
-కె.రోజా, విద్యుత్ శాఖ ఏఈ
ఇదీ చదవండీ...నివర్తో ఒక్కసారిగా పెరిగిన వరి కోత ధరలు