Hyderabad Metro Staff Protest on Second Day: మెట్రో టికెటింగ్ సిబ్బందికి జీతాలు పెంచాలంటూ మంగళవారం రోజున ఎల్బీనగర్ నుంచి మియాపూర్ కారిడార్‌లోని 27 మెట్రో స్టేషన్లలో సిబ్బంది ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఆ ఆందోళన ఇవాళ కూడా కొనసాగుతోంది. సిబ్బంది విధులకు హాజరుకాకుండా నాగోల్ మెట్రో కార్యాలయం వద్ద ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నారు. తమ వేతనాలు పెంచాలంటూ నిన్నటి నుంచి మెట్రో రైల్ టికెటింగ్ సిబ్బంది నిరసన కొనసాగిస్తున్నారు. మరోవైపు అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో కార్యాకలాపాలతోపాటు ప్రయాణికుల రాకపోకలు, టికెట్ల జారీ యథాతథంగా కొనసాగుతున్నాయి.
తమ జీతాలు పెంచాలంటూ మంగళవారం రోజున ఎల్బీనగర్ నుంచి మియాపూర్ కారిడార్‌లోని 27 మెట్రో స్టేషన్లలో సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఆయా స్టేషన్ల వద్ద మెట్రో టికెటింగ్ ఉద్యోగులు ధర్నాలకు దిగారు. గత కొంత కాలంగా తమకు సరైన జీతభత్యాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్నప్పుడు రిలీవర్ సరైన సమయానికి రాకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కనీసం భోజనం చేయడానికీ సమయం ఇవ్వడం లేదని ఆక్షేపించారు. వేతనాలు పెంచే వరకు విధులకు హాజరుకాబోమని తేల్చిచెప్పారు.
నిన్న సిబ్బంది మెరుపు ఆందోళనతో మెట్రో కియోలిస్ సబ్ ఏజెన్సీ నిర్వాహకులు వారితో.. అమీర్‌పేట్ మెట్రోస్టేషన్‌లో చర్చలు జరిపారు. దాంతో ధర్నా విరమిస్తున్నట్లు ప్రకటించిన ఉద్యోగులు.. నిర్వాహకులు వేతనాల పెంపుపై ఉన్నతాధికారులతో చర్చించి చెబుతామన్నారని తెలిపారు. స్పష్టమైన హామీ వచ్చేవరకు.. విధులకు మాత్రం హాజరుకామని టికెటింగ్ సిబ్బంది స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: