శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కొరసవాడలో విషాదం నెలకొంది. కార్పెంటర్‌గా పనిచేసిన వెంకటరమణ... ఉపాధి అవకాశాల్లేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. అప్పుల బాధ తాళలేక గురువారం ఇంట్లో శీతల పానీయంలో పురుగుల మందు కలుపుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు అతణ్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆయన శుక్రవారం మృతి చెందాడు.
వెంకటరమణ తాగిన సీసాను ఇంట్లో పడి వేయడంతో... శీతల పానీయం అనుకొని... సీసాలో మిగిలిన విషాన్ని కుమారుడు నిహాల్, కుమార్తె యామిని సేవించారు. చిన్నారులకు అస్వస్థత కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి కాస్త మెరుగుపడటంతో వైద్యులు పిల్లలను ఇంటికి పంపిచారు. శనివారం మధ్యాహ్నం పిల్లలకు వాంతులు రావడంతో విశాఖ కేజీహెచ్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం నిహాల్ ప్రాణాలు కోల్పోయాడు. కుమార్తె యామిని పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స అందిస్తున్నారు.
చిన్నాభిన్నమైన కుటుంబం
అసలే భర్తను కోల్పోయిన భార్య సుజాత పుట్టెడు దుఃఖంలో ఉండగా కుమారుడి మృతితో మరింత కుంగిపోయింది. ఒక్క రోజు వ్యవధిలో తండ్రి, కుమారుడు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆదివారం రాత్రి బాలుని మృతదేహాన్ని విశాఖపట్నం నుంచి కొరసవాడ స్వగ్రామానికి తీసుకువచ్చారు. ప్రస్తుతం కుమార్తె యామిని విశాఖపట్నం కేజీహెచ్‌లో వైద్య సేవలు పొందుతోంది. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ అమీర్ అలి తెలిపారు.
ఇదీ చదవండి:
scientists stickers : విజయవాడలో శాస్త్రవేత్తల స్టిక్కర్లు అవిష్కరణ