AP Roads at Danger Situation : వర్షాకాలం కావడంతో రాష్ట్రంలో ఉన్న రహదారుల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. అడుగుకో గుంత.. గజానికో మడుగు అన్నట్లు తయారైన రోడ్లు.. ప్రయాణికులకు నరకం అంటే ఏంటో ప్రత్యక్షంగా చూపిస్తున్నాయి. కనీస మరమ్మతులు చేయకపోవడంతో గుంతల రోడ్లపై రాకపోకలు కష్టతరంగా మారింది. అలాంటి రహదారుల్లో ఉదాహరణకు కొన్ని ఇప్పుడు చూద్దాం. జన సైనికులు, సీఐటీయూ నేతలు రోడ్లు బాగుచేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
జారుడు బల్లగా మారిన రహదారులు : చూస్తున్నారుగా ఈ ఆర్టీసీ బస్సు పరిస్థితి. కొంచెమైతే పక్కనున్న పొలాల్లో పడిపోయేది. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు - శివాపురం మధ్య రోడ్డు దుస్థితే ఈ ఘటనకు కారణమైంది. తాగునీటి పైపులైన్ కోసం తవ్విన మట్టిని తారు రోడ్డుపైనే పడేశారు. రోజులు గడుస్తున్నా మట్టి తీయలేదు. ఈ లోపు వానలు వచ్చేశాయి. ఇంకేముంది.. ఆ రోడ్డు కాస్త జారుడు బల్లలా మారింది. తిరువూరు నుంచి జగ్గయ్యపేట తిరిగే ఆర్టీసీ బస్సు.. బురద మట్టిపై జారి పక్కకి ఒరిగింది. బస్సు డ్రైవర్, ప్రయాణికులు ఎంత ప్రయత్నించినా సాధ్యంకాక జేసీబీ సాయంతో బయటికి లాగాల్సి వచ్చింది.
జన సైనికుల ఆందోళన.. డిమాండ్స్ : ఏలూరు జిల్లాలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయంటూ.. జన సైనికులు ఆందోళన చేపట్టారు. ఫిల్ హౌస్ పేట, కైకలూరు మధ్య ధర్నా చేశారు. రోడ్ల సమస్యలపై గతంలో ఆందోళన చేస్తే తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేశారని మండిపడ్డారు. శాశ్వతంగా రోడ్లను బాగు చేయాలని డిమాండ్ చేశారు.
సీఐటీయూ నేతల నిరసన.. ప్రభుత్వంపై ఆగ్రహం : రాష్ట్రంలోని రోడ్లపై ప్రయాణించాలంటే నరకప్రాయంగా ఉంటుందంటూ.. కొన్ని ప్రాంతాల్లో రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ వద్ద గుంతలమయంగా తయారైన రోడ్డుపై వరినారువేసి, ఆ గుంటలో ఈత కొడుతూ సీఐటీయూ నేతలు నిరసన తెలిపారు. అంతర్రాష్ట్ర రహదారి దారుణంగా దెబ్బతిన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారీగా చేరిన వర్షపు నీరు.. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం : శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం బొడ్డేపల్లి - తాడివలస రైల్వే అండర్ పాస్‌లోకి భారీగా వర్షపు నీరు చేరింది. అక్కడున్న రైల్వే గేటును మూసివేయడంతో వాహదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవటంతో నీరు బయటకు వెళ్లడం లేదని వాహనదారులు అంటున్నారు. సుమారు 15 గ్రామాల ప్రజల రాకపోకలకు ఉపయోగపడుతున్న ఈ రోడ్డుని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.