శ్రీకాకుళం జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. నానాటికీ కొవిడ్ బాధితుల సంఖ్య పెరగటం సర్వత్రా ఆందోళన రేపుతోంది. రోజుకు సగటున వందలసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 586 కేసులు నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. దీంతో జిల్లాలో బాధితుల సంఖ్య 6 వేల 168కు చేరుకుంది.
లాక్‌డౌన్ తొలినాళ్లలో జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. ఆంక్షల సడలింపు తరువాత వలస కూలీల రాకతో స్వరూపమే మారిపోయింది. ఏప్రిల్ నెలలో 5 కరోనా కేసులు నమోదయ్యాయి. మేలో వంద మార్కు దాటి 142కు చేరుకున్నాయి. జూన్‌లో 421 కేసులు నమోదవ్వగా.. ఇప్పటివరకు వరకూ 6168 మందికి వైరస్ సోకింది. జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టినా... సామాజిక వ్యాప్తి దిశగా విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా పట్టణాల్లో అన్ని వీధులు కంటైన్మెంట్ జోన్లలోకి వెళ్తున్నాయి. గ్రామాల్లో కూడా కంటైన్మెంట్ జోన్‌ల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 66 మంది మృత్యువాత పడటం అందరినీ కలవరపెడుతోంది.
ఇప్పటివరకూ ఫలితాల్లో జాప్యం ఉంటేనే వందలాది కేసులు బయటపడగా.. పరీక్షలు వేగవంతం చేస్తే బాధితులు ఎక్కువగా వెలుగుచూసే అవకాశముంది. ఎటువంటి లక్షణాలు కనిపించినా ప్రజలే స్వచ్ఛందంగా నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని... కలెక్టర్ నివాస్ విజ్ఞప్తి చేశారు. పరీక్ష కిట్లు, సరికొత్త యంత్రాలు జిల్లాకు చేరుకోవడంతో నిర్ధరణ పరీక్షలు ఊపందుకున్నాయి. యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కొవిడ్ కేర్ సెంటర్లలను ఏర్పాటు చేసింది. అన్ని వసతులు ఉంటే హోం ఐసోలేషన్‌ల్లో వైద్యం అందించేందుకు నిర్ణయించింది. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన వీడీఆర్ ల్యాబ్‌కు పంపిస్తున్నారు. ఇక్కడ రోజుకు 2వేల నమూనాలను పరీక్షించే సామర్థ్యం మాత్రమే ఉండడం.. అంతకుమించి నమూనాలు సేకరిస్తుండటంతో ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వైరస్ బాధితులు.. వారి కుటుంబసభ్యుల ఆందోళన దృష్ట్యా... కలెక్టర్ ప్రస్తుతమున్న వీడీఆర్ ల్యాబ్‌కు అనుబంధంగా మరో ల్యాబ్ ఏర్పాటు చేసి రోజుకు 4వేలకు పరీక్షలు పెంచే దిశగా చర్యలు చేపట్టారు. అలాగే మరోవైపు జిల్లాలోని కొవిడ్ ఆసుపత్రుల్లో పోస్టుల భర్తీ యుద్దప్రాతిపదకన చేపడుతున్నారు.
కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి జిల్లాలో 8వేల మందికి సరిపడా సౌకర్యాలు ఉండేలా జిల్లా పాలనాధికారి నివాస్ ప్రణాళికలతో ముందడుగు వేస్తున్నారు. అందుబాటులో ఉన్న అన్ని వసతులను కోవిడ్ కేర్ కేంద్రాలుగా మార్చుతున్నారు. కనీసం 3వేల మందిని హోం ఐసోలేషన్‌లో పెట్టి చికిత్సను అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం 1389 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కోవిడ్ కేర్ కేంద్రాల్లో 757 మంది.. కొవిడ్ ఆసుపత్రుల్లో 6 41 మంది మాత్రమే ఉన్నారు.
టెక్కలి జిల్లా ఆసుపత్రిలో 105 పడకలు ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయి. వీటితోపాటు ప్రైవేటు ఆసుపత్రులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. జిల్లా కొవిడ్ ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న 50 ఐసీయు బెడ్లను 80కు పెంచుతున్నారు. దీంతో 150 ఐసీయు పడకలు అందుబాటులో ఉంటాయి. జిల్లాలో ఇప్పటి వరకు లక్ష 53 వేల 607 మందికి నమూనాలు సేకరించామని కొవిడ్ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ బగాది జగన్నాథరావు తెలిపారు. కొవిడ్ నుంచి రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: '