శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పర్యటించనున్నారు. సీఎం హోదాలో తొలిసారి జిల్లా వస్తున్న జగన్... పలాస, ఎచ్చెర్ల, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఉదయం తొమ్మిదిన్నరకు గన్నవరం నుంచి బయల్దేరనున్న సీఎం... విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి హెలీకాప్టర్‌లో పలాసకు 11 గంటలకు చేరుకోనున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో కాశీబుగ్గ రైల్వే మైదానం చేరుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
ఉద్దానంలో అభివృద్ధి కార్యక్రమాలు
ఉద్దానం ప్రాంతంలో ఆరు వందల కోట్లతో నిర్మించనున్న తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. పలాసలో 50 కోట్లతో నిర్మించనున్న రెండు వందల పడకల కిడ్నీ సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రితో పాటు కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌కు శ్రీకారం చుట్టనున్నారు. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో మత్స్యకారుల కోసం 11 కోట్ల 95 లక్షలతో నిర్మించనున్న జెట్టీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. తిత్లీ పరిహారం పెంపు ప్రక్రియకు ఇక్కడ నుంచే శ్రీకారం చుట్టనున్నారు.
విద్యార్థులతో ముఖాముఖి
పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలో చేపట్టిన ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీని సీఎం ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి ఎచ్చెర్ల మండలం ఎస్.ఎం.పురం ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను సీఎం ఆవిష్కరించనున్నారు. 28 కోట్లతో నూతనంగా నిర్మించిన అకడమిక్ తరగతి గదులతో పాటు వసతి గృహాల భవన సముదాయాలను జగన్ ప్రారంభిస్తారు. అనంతరం ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అక్కడి నుంచి సింగుపురం చేరుకొని అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్‌ను జగన్ ప్రారంభించనున్నారు.పర్యటన ముగిసిన తర్వాత సీఎం విశాఖ చేరుకోనున్నారు.
ఇదీచదవండి