పొట్టచేతపట్టుకుని పరాయి రాష్ట్రం వెళ్లిన వేలమంది జాలర్లు లాక్‌డౌన్ వల్ల కష్టాలు పడుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వేల మంది గుజరాత్ వీరావల్‌కు 8 నెలల క్రితం చేపల వేటకు వలస వెళ్లారు. కరోనా ప్రభావంతో కేంద్రం లాక్‌డౌన్ ప్రకటించడంతో వీరంతా ఒడ్డునే ఉండిపోయారు. పనిలేక, వండుకుని తినడానికి సరకుల్లేక దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నారు. సొంతూళ్లకు వద్దామంటే కుదరడం లేదు. ఈ క్రమంలోనే ఈనెల 7న శ్రీకాకుళం జిల్లా గార మండలం కె.మత్స్యలేశానికి చెందిన జగన్నాథం, 22న ఎచ్చెర్ల మండలం డి. మత్స్యలేశానికి చెందిన కొయిరాజు అనారోగ్యంతో మృతిచెందారు. లాక్‌డౌన్ వల్ల రాకపోకలకు వీల్లేక, సహచరులంతా వారికి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. సొంతూళ్లకు వెళ్లలేకపోయామనే బెంగతోనే అనారోగ్యంపాలవుతున్నారని వాపోతున్నారు. తమను స్వరాష్ట్రానికి తీసుకెళ్లాలని వేడుకుంటున్నారు.
కడ చూపు నోచుకోలేక
మత్స్యకారుల మృతితో శ్రీకాకుళం జిల్లాలోని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కుటుంబపెద్ద కడ చూపులకూ నోచుకులేకోలేకపోయామని మృతుల బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఫోన్‌లో అక్కడివాళ్ల కష్టాలు వినలేకపోతున్నామని తమవారిని వెంటనే రప్పించాలని బంధువులు కోరుతున్నారు.
గుజరాత్ సీఎంకు జగన్ ఫోన్
ఈ పరిణామాలపై సీఎం జగన్.. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్‌రూపాణీతో ఫోన్‌లో చర్చించారు. సముద్రమార్గంలో మత్స్యకారులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సాయంత్రం వీరావల్ నుంచి విశాఖకు బోట్లు బయలుదేరే అవకాశం ఉంది. తమవారి కోసం మత్స్యకార కుటుంబాలు నిరీక్షిస్తున్నాయి.
ఇదీ చదవండి : కన్నవారి చివరి ఘడియలు.. కూతుళ్లే దిక్కయ్యారు!