శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 'న్యూస్టుడే' కంట్రిబ్యూటర్ వట్టికూళ్ల కీర్తికుమార్పై రాజకీయ కక్షతో కుట్రపూరితంగా, వ్యక్తిగత విద్వేశాలతో కేసు నమోదు చేశారని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరావు ఆక్షేపించారు. టెక్కలి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఆదిత్యకల్యాణ మంటపంలో నిర్వహించిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సంతబొమ్మాళిలోని ఆలయ కూడలిలో నంద విగ్రహప్రతిష్ఠ ఘటన కేసులో కీర్తి కుమార్ పేరు నమోదుచేయడాన్ని టెక్కలి ప్రెస్ క్లబ్, పాత్రికేయుల సంఘాల తరఫున ఆయన తీవ్రంగా ఖండించారు. సంఘటనపై మెజిస్టీరియల్ విచారణ జరిపించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ఏవో కల్యాణ చక్రవర్తికి వినతిపత్రం అందించారు. సబ్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్ ను కలిసి సమస్యను వివరించారు.
కేసును బేషరతుగా వెనక్కు తీసుకోండి:
ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసిన పోలీసులు సీసీ ఫుటేజీ, కాల్ డేటా ఆధారాలను ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. పాత్రికేయ చట్టాలను గౌరవించి ఆధారాలు పరిశీలించాక కేసు నమోదు చేయాలి తప్ప నిందమోపి కేసు పెట్టడం తగదన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తగదని, జిల్లాలో, రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ధోరణి మార్చుకోవాలని హితవు పలికారు. పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం ఆలోచించి కేసును బేషరతుగా వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండు చేశారు. ఇటువంటివి పునరావృతమైతే ప్రజాసంఘాలతో కలిసి నిరసన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. టెక్కలి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బెండి నర్సింగరావు మాట్లాడుతూ రాజకీయాల్లోకి పాత్రికేయుల్ని లాగొద్దని, తప్పుచేయకుండా కేసులు బనాయించడం సరికాదని, ఇటు వంటి ఘటనలను ప్రజలు, ప్రజాసంఘాలు ఖండించాలని అన్నారు.
ఇదీ చదవండి: 'ఏ తప్పు చేయకపోయినా పత్రికా విలేకరిపై కేసులా?'