Fake Call to Stop the Train: రైలును ఎలా అయినా ఎక్కాలి అని ఆ వ్యక్తి చేసిన ఓ పని.. అతనికి కష్టాలు తెచ్చిపెట్టింది. పోలీసులు అతనిని అరెస్ట్ చేసే వరకూ వచ్చింది. అసలు ఇంతకీ ఆ వ్యక్తి చేసిన పని ఏమిటి? పోలీసులు అతనిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి నర్సాపూర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు సుమారు గంట సమయం ఆగేందుకు కారణమైన వ్యక్తిని ధర్మవరం రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం అతను చేసిన ఒక్క కాల్.. అతనికి ఆ పరిస్థితిని తీసుకొచ్చింది. తేజేశ్వర్ నాయక్, అతని భార్య.. ఈనెల 3వ తేదీన ధర్మవరం నుంచి కదిరి మీదుగా తిరుపతికి వెళ్తున్న రైళ్లో ప్రయాణించేందుకు నిర్ణయించుకున్నారు.
వెళ్లాలని అయితే నిర్ణయించుకున్నారు.. కానీ సమయం మించి పోతోంది. రైలు వెళ్లిపోతుందని తేజేశ్వర్ నాయక్ భావించాడు. ఎలా అయినా ప్రయాణం చేసి తీరాలని అనుకున్నాడు. దీని కోసం రైలును ఆపడమే తన ముందు ఉన్న మార్గం అని భావించి.. రైల్వే స్టేషన్ మేనేజర్‌కు ఫోన్ చేశాడు.
స్టేషన్ మేనేజర్‌కు ఫోన్ చేసిన తేజేశ్వర్ నాయక్.. రైల్వే ట్రాక్ సరిగా లేదని నరసాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలును నిలిపివేయాలని చెప్పాడు. దీంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. రైల్వే సిబ్బంది హుటాహుటిన చేరుకుని.. సుమారు 15 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అంతా సక్రమంగానే ఉండటంతో రైలును అధికారులు యథావిధిగా పంపించారు.
ఇంతటితో దీనిని రైల్వే పోలీసులు వదలలేదు. ఫోన్ చేసిన వ్యక్తి తప్పుడు సమాచారం ఇచ్చాడని.. అసలు ఆ ఫోన్ ఎవరు చేశారో అని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఫోన్ చేసిన తేజేశ్వర్ నాయక్.. కాల్ డేటాను పరిశీలించారు. దీంతో తేజేశ్వర్ నాయక్ కూడా అదే రైలులో ప్రయాణించినట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. అతడికి కాల్ చేయగా.. ఫోన్ స్విచాఫ్ వచ్చింది.
ఫేక్ కాల్ చేసి రైలు ఆగేందుకు కారణమైన తేజేశ్వర్ నాయక్ చిరునామా కనుక్కొని కేసు నమోదు చేశారు. దీంతో అతడే స్వయంగా వచ్చి ధర్మవరం రైల్వే పోలీసులకు లొంగిపోయాడు. అతడని అరెస్టు చేసిన రైల్వే పోలీసులు కోర్టులో హాజరు పరచగా.. కోర్టు రిమాండ్‌కు ఆదేశించింది.
"ఒక వ్యక్తి మాకు ఫోన్ చేసి.. కదిరి - నల్లచెరువు మధ్యలో రైల్వే ట్రాక్ డ్యామేజ్ అయింది అని చెప్పారు. రైలును ఆపి.. ట్రాక్‌ని పరిశీలించాము. కానీ ఎక్కడా డ్యామేజ్ లేదు. ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం తప్పు అని తెలిసిన తరువాత.. ఏ ఫోన్ నుంచి అయితే కాల్ వచ్చిందో అతనిని గుర్తించాము. ఆ వ్యక్తిని ఈ రోజు అరెస్ట్ చేశాం. విషయం తెలిసిన తరువాత అతనే స్టేషన్‌కి వచ్చి లొంగిపోయాడు". - నాగరాజు, రైల్వే సీఐ, ధర్మవరం
ఇవీ చదవండి: