Lepakshi temple: తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన ఒకే ఒక ఆలయం రామప్ప. భవిష్యత్తులో ప్రపంచ వారసత్వ హోదా వచ్చే అవకాశమున్న మరో ఆశాకిరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసత్యసాయి (పూర్వ అనంతపురం) జిల్లాలోని లేపాక్షి ఆలయం. రెండు నెలల కిందట యునెస్కో తాత్కాలిక జాబితా (టెంటెటివ్ లిస్ట్)లో ఈ ఆలయానికి చోటు దక్కింది. ప్రభుత్వం ఇప్పటి నుంచి దృష్టిసారించి పలు చర్యలు తీసుకుంటే రెండు, మూడేళ్లలో ఈ ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కే అవకాశముంది.
రామప్ప ఆలయం కోసం పనిచేసిన హైదరాబాద్‌కు చెందిన ఆర్కిటెక్ట్ జీఎస్‌వీ సూర్యనారాయణమూర్తి.. తన కన్సెల్టెన్సీ సంస్థ ద్వారా లేపాక్షి ఆలయం కోసం కూడా గత మూడేళ్లుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘లేపాక్షి’కి ప్రపంచ వారసత్వ హోదా రావడానికి ఉన్న అవకాశాలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై సూర్యనారాయణమూర్తితో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది.
‘‘యునెస్కో గుర్తింపు ఇవ్వడానికి ఆ కట్టడానికి లేదా ప్రదేశానికి ఉన్న ఔట్ స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ (విశ్వజనీనమైన ప్రత్యేకత) చూస్తారు. పెయింటింగ్ వేసినట్లు చెక్కిన రాతి శిల్పాలు ఉండటం లేపాక్షి ఆలయం ప్రత్యేకత. 16వ శతాబ్దానికి చెందిన దీన్ని విజయనగర సామ్రాజ్యం పతనం తరవాత అప్పటి ఆలయాల శైలిలో నిర్మించారు.
- ప్రస్తుతం ఈ ఆలయానికి యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కగా.. ప్రపంచ వారసత్వ హోదా దక్కడానికి మరికొన్నేళ్లు కసరత్తు చేయాల్సి ఉంటుంది. వచ్చే నెలలో రష్యాలో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. దాని తర్వాత డోసియర్ (సమగ్ర వివరాలతో కూడిన పుస్తకం) తయారు చేయాలనే సమాచారం వస్తుంది. ఈ సమాచారం రాగానే ఆలయానికి సంబంధించిన సమగ్ర వివరాలను పొందుపరచాలి. ఆలయ సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
- రామప్ప ఆలయం 2014లో తాత్కాలిక జాబితాలో చేరగా గతేడాది గుర్తింపు దక్కింది. హోదా అంత సులువుగా రాదు. ఆలయాలు, కట్టడాల వెనక స్థానికంగా అనేక కథలు ఉంటాయి. డోసియర్‌లో వాటి గురించి రాయలేం. కేవలం శిల్పవైభవాన్ని వివరించి, దాని వెనకాల చారిత్రక విశేషాలు, శాస్త్రీయ అంశాలను మాత్రమే పొందుపరచాలి. అప్పుడే యునెస్కో దీన్ని పరిగణనలోనికి తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ కోణంలో దృష్టిసారించి తదుపరి ప్రక్రియల్ని వేగవంతం చేయాలి. ఇప్పటి నుంచి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే కనీసం 2025 వరకైనా గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది.
- అసోంలోని బ్రహ్మపుత్ర నది దీవిలో ఉండే మజూలి అనే 32 మఠాల సమూహాన్ని సైతం యునెస్కో తాత్కాలిక జాబితాలో చేర్చారు. దీనికి కూడా నేను పనిచేశాను. చార్మినార్ ప్రాంతాన్ని పాదచారులకు అనుకూలంగా తీర్చిదిద్దే ప్రాజెక్టు ప్రస్తుతం కొనసాగుతోంది. మరో రెండేళ్లలో ఇది పూర్తవుతుంది.
ఇటీవల ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌లో కొనియాడిన హైదరాబాద్ బన్సీలాల్‌పేట మెట్ల బావి పునరుద్ధరణ పనులతోపాటు పాతబస్తీలోని మురిగీ మార్కెట్ పునరుద్ధరణ, ఎన్టీఆర్ జిల్లాలోని ముక్త్యాల రాజావారి కోట పనులనూ మా సంస్థ ద్వారా చేస్తున్నాం’’ అని సూర్యనారాయణమూర్తి వివరించారు.
ఇదీ చదవండి: