sexually harassing in Satyasai District: సత్యసాయి జిల్లా తలుపుల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కీచక అధ్యాపకులపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. విద్యార్థినులతో పాటు మహిళా అధ్యాపకులను వేధిస్తున్న లెక్చరర్ల తీరుపై.. ఈటీవీ భారత్-ఈనాడుల్లో కథనాలు వచ్చాయి. వాటిని చూసిన తల్లిదండ్రులతోపాటు తెలుగుదేశం, సీపీఐ నేతలు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో కళాశాల పేరెంట్స్ కమిటీ ఛైర్మన్, వైకాపా నేత ప్రభువర్దన్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు లెక్చరర్లకు అండగా నిలిచారు. అధ్యాపకులు నాగరాజు, ఆంజనేయులును కళాశాల స్టాఫ్ గదిలో తనతో కూర్చోబెట్టుకొని ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని.. తానున్నానని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. విద్యార్థినులకు అండగా నిలిచిన ఎకనమిక్స్ లెక్చరర్ ప్రమీలను పిలిపించి అందరి ఎదుట చీవాట్లు పెట్టారు. ఇంతలో విచారణ అధికారుల బృందం కళాశాలకు రావటంతో ప్రభువర్దన్ అక్కడి నుంచి జారుకున్నారు.
విచారణకు వచ్చిన అధికారులు సైతం విద్యార్థుల పక్షాన నిలబడకుండా.. కీచక అధ్యాపకులను కాపాడే ప్రయత్నం చేశారు. కీచక అధ్యాపకులకు మద్దతుగా కొందరు రాజకీయ నాయకులు, కులసంఘాల నేతలు వచ్చి విచారణ అధికారులతో వేర్వేరుగా మాట్లాడారు. అయితే విద్యార్థులు గట్టిగా నిలబడటంతో కామర్స్ లెక్చరర్ నాగరాజును సస్పెండ్ చేస్తూ.. డీవీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. కీచక అధ్యాపకుల ఆగడాలపై విద్యార్థుల ఫిర్యాదును కళాశాల ప్రిన్సిపాల్ నీలోఫర్.. రెండు నెలల క్రితం డీవీఈవో దృష్టికి తీసుకెళ్లారు. కళాశాలలో విచారణ నిర్వహించినప్పటికీ చర్యలకు సిఫార్సు చేయలేదని, ఆరోపణలు ఎదుర్కొంటున్న లెక్చరర్లకు అనుకూలంగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి.
అప్పట్లోనే చర్యలు తీసుకొని ఉంటే, ఇద్దరు లెక్చరర్ల ఆగడాలకు అడ్డుకట్ట పడేదని విద్యార్థులు అంటున్నారు. ప్రస్తుత విచారణలో ఆంజనేయులు అనే అధ్యాపకుడికి అభయం ఇచ్చి, నాగరాజును సస్పెండ్ చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఈసీ, హెచ్‌ఈసీ తరగతుల్లో ఆయా విభాగాల అధ్యాపకులు విద్యార్థినులను లైంగిక వేదింపులకు గురిచేశారనే ఆరోపణలు వినిపిస్తుండగా... కేవలం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులను మాత్రమే విచారించడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. వివిధ కుల సంఘాలు, స్థానిక నేతల ఒత్తిళ్ల వల్లనే ఓ అధ్యాపకుడికి క్లీన్‌చీట్ ఇచ్చేలా నివేదిక రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: బురద రాజకీయాలు చేయడం మాకు చేతకాదు: పవన్ కల్యాణ్