రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాలలోని గడియార స్తంభం కూడలిలో ఎమ్మెల్సీ పోతుల సునీత ఆధ్వర్యంలో వైకాపా నాయకులు వేడుకలు నిర్వహించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి, ఏడాది పాలన కరపత్రం విడుదల చేసారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు పండ్లు, పాలు, బేబీ కిట్లు అందించారు.
వైకాపా నాయకుడు కరణం వెంకటేష్ మాట్లాడుతూ.. పేద ప్రజల ఉన్నతికోసం అనేక సంక్షేమ పథకాలు రూపొందించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపటం కోసం జగన్ అహర్నిశులు శ్రమిస్తున్నారని కొనియాడారు.