చేపల వేటతో ఉపాధి పొందుతున్న మత్స్యకారులకు ఇతర జిల్లాల నుంచి వచ్చేవారితో తలనొప్పి తయారయ్యింది. ప్రకాశం జిల్లా మద్దిపాడు, అద్దంకి సరిహద్దులో ఉన్న గుండ్లకమ్మ జలాశయం బెక్ వాటర్ ప్రాంతంలో దేనువకొండ గ్రామానికి చెందిన వారు కొన్నేళ్లుగా చేపల వేట సాగిస్తున్నారు. సుమారు 40 కుటుంబాలకు మత్స్యశాఖ లైసెన్సు మంజూరు చేసింది.
ఇటీవల కృష్ణా జిల్లా కైకలూరు ప్రాంతం కొల్లేరు మత్స్యకారులు ఇక్కడకు వచ్చి అనధికార వేట ప్రారంభించారు. వలలు కాకుండా బుట్టలు వేస్తున్నారు. చేపలను ఆకర్షించడానికి ఎరలు పెడుతున్నారు. ఫలితంగా చిన్నచిన్న చేప పిల్లలు బుట్టలో పడుతున్నాయి. కొల్లేరు మత్స్యకారులు చర్యల వల్ల గుండ్లకమ్మలో మత్స్య సంపద నశిస్తుందని, వీరికి ఎలాంటి అనుమతిలేదని, చట్ట విరుద్ధంగా వేట సాగిస్తున్నారని దేనువకొండ మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.