మూలిగే నక్క మీద తాటి పండు పడిన చందంగా మారింది గ్రానైట్ పాలిషింగ్ యూనిట్ల పరిస్థితి. ప్రకాశం జిల్లా మార్టూరు, చీమకుర్తి, మద్దిపాడు గ్రోత్ సెంటర్ ప్రాంతాల్లో.... వందలాది గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. గ్రానైట్ రాయిని కొనుగోలుచేసి.. పాలిష్ పెట్టి పలకలుగా మార్చి మార్కెట్ చేస్తారు. గ్రానైట్ పలకల నాణ్యతను బట్టి స్థానిక మార్కెట్‌తో పాటు, చైనాకు ఎగుమతి చేస్తారు. అయితే గత మూడు నెలలుగా చైనాకు ఎగమతులు సన్నగిల్లాయి. రవాణా ఛార్జీలు విపరీతంగా పెరగడం వల్ల బయ్యర్లు సరకును ఎగుమతులు చేయడానికి ముందుకు రావడం లేదు. దీనికి తోడు కృష్ణపట్నం నుంచి వచ్చే కంటైనర్లకు కొరత ఏర్పడటంతో గ్రానైట్ వ్యాపారం కుంటుపడింది.
పెరుగుతున్న డీజిల్ ధరల వల్ల వాహనాల అద్దెలు పెరిగిపోయాయి. ఫలితంగా గ్రానైట్ రాయిని చెన్నై నుంచి తెప్పించుకోడానికి వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 45 శాతం రాయల్టీ పెంచడం వల్ల రాయి ధర కూడా పెరిగి...గుదిబండలా మారింది. వ్యాపారం లేక పలక నిల్వలు పేరుకుపోయి వ్యాపారులు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు.
గ్రానైట్ కంటైనర్లు రాకపోవడం వల్ల... కూలీలకు పనిలేకుండా పోయింది. లోడింగ్ కోసం వచ్చే దినసరి కూలీలు రోజూ నిరాశతోనే వెనుతిరుగుతున్నారు. ఆదాయం లేక కుటుంబపోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో వేలాది మందికి ఉపాధి కల్పించే గ్రానైట్ పరిశ్రమను ఆదుకోవాలని వ్యాపారులు, కూలీలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: