ఆది దంపతులకు మహా శివరాత్రి సందర్భంగా మాఘ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు అతి ముఖ్యమైనవి. శ్రీశైల క్షేత్రంలో 11 రోజులు సాగే ఈ బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు ప్రధానమైంది. ఆ రోజు మహాశివరాత్రి. ఆలయంలో కొలువుదీరిన అర్చారూపమే కాదు.... ఆలయం సైతం స్వామి వారి విరాట్ రూపమని శాస్త్రాలు చెబుతాయి. ఈ భావనకు నిదర్శనంగా నాటి రాత్రి ఆలయంపై పాగాలంకరణ జరుగుతుంది. గర్భాలయం శిఖరం నుంచి ముఖమండపంపై భాగంలో ఉన్న నందులను కలుపుతూ వస్త్రాన్ని అలంకరిస్తారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం దేవాంగపురికి చెందిన పృథ్వీ వంశం వారు నేసిన వస్త్రంతోనే ఈ అలంకరణ జరగటం ఆనవాయితీ. ఈ పాగా తయారీ కూడా ఆసక్తికరమే.
రెండు నెలల ముందే
శివరాత్రికి రెండు నెలల ముందే వస్త్రం తయారీకి శ్రీకారం చుడతారు పృథ్వీ వంశస్థులు. ఈ సమయంలో నియమ నిష్ఠలతో రోజులో ఒంటి పూట మాత్రమే భోజనం చేస్తూ 300 మీటర్ల వస్త్రాన్ని నేస్తారు. దీనిని పాగాలంకరణకు రెండు రోజుల ముందు శ్రీగిరికి తీసుకువస్తారు. మహాశివరాత్రి పర్వదినం రోజు రాత్రి 11 గంటల సమయంలో గర్భాశయంలో రుద్రాభిషేకం జరుగుతుండగా, ఆలయంలోని అన్ని విద్యుద్దీపాలను ఆర్పివేస్తారు. తర్వాత చిమ్మచీకట్లో..... వృద్ధుడైన పృథ్వీ వెంకటేశ్వర్లు దిగంబరుడై స్వామి ఆలయ విమానగోపురానికి, ముఖమండప నందులకు తలపాగాను నేత్రశోభితంగా అలంకరిస్తారు. పాగాలంకరణ పూర్తవగానే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కనుల పండువగా ప్రారంభమవుతుంది. దేవాంగపురికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు 60 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వస్త్రాన్ని తమ సొంత ఖర్చులతో తయారు చేస్తున్నామని వారు తెలిపారు.
ఈ ఏడాదీ పృథ్వీ వంశస్థులు రెండు తలపాగాలను సిద్ధం చేశారు. ఆదివారం వీటికి ప్రత్యేక పూజలు చేసి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చీరాల మండలం పందిళ్లపల్లి వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం శ్రీశైలానికి తీసుకెళ్లారు.
ఇదీ చదవండి: