ప్రకాశం జిల్లాలో...
కనిగిరి పట్టణంలో ఎమ్మెల్యే బొర్రా మధుసూదన్ ఆధ్వర్యంలో.. ఆసరా పథకం ద్వారా లబ్ధిపొందిన మహిళలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడలి మీదుగా.. ఒంగోలు రోడ్డు వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. కరోనా వ్యాప్తి చెందుతుందనీ.. సామాజిక దూరం పాటించాలని అధికారులు చెప్తున్నా.. అధికార పార్టీ నేతలకు అవేమీ పట్టనట్లే ఉంది. భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
విజయనగరం జిల్లాలో...
సాలూరు మండలం మామిడిపల్లిలో వైఎస్సార్ ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పొదుపు సంఘాల మహిళలు జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వైకాపా నేతలు, పొదుపు సంఘాల మహిళలు పెద్ద ఎత్తున సమావేశం అయ్యారు.
కర్నూలు జిల్లాలో...
పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆధ్వర్యంలో ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించటమే లక్ష్యంగా.. ముఖ్యమంత్రి జగన్ పని చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తే.. సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారని శ్రీదేవి అన్నారు.
అనంతపురం జిల్లాలో...
గుత్తిలో వైయస్ఆర్ ఆసరా వారోత్సవాలను మంత్రి శంకర్ నారాయణ ప్రారంభించారు. వైకాపా మహిళల కోసమే పుట్టిందని మంత్రి అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఏకైక వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. అనంతరం పొదుపు సంఘాల మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు.
తూర్పు గోదావరి జిల్లాలో...
వైయస్ఆర్ ఆసరా పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని.. ఆర్థికంగా స్థిరపడాలని పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. లంకలగన్నవరంలో వైయస్ఆర్ ఆసరా పథకంపై అవగాహన కల్పించారు. సమాజంలో అన్ని వర్గాల మహిళలకు సీఎం జగన్ ఆర్థిక చేయూత అందిస్తున్నారని అన్నారు.
చిత్తూరు జిల్లాలో...
తిరుపతి గ్రామీణ మండలం ఎంపీడీవో కార్యాలయంలో ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించారు. పొదుపు సంఘాల మహిళలకు ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేర్చుతారని అన్నారు.
ఇదీ చదవండి: ఫిబ్రవరిలోగా అంతర్వేది రథాన్ని నిర్మిస్తాం: మంత్రి వెల్లంపల్లి