ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు వద్ద సముద్ర గర్భంలో కేజ్ కల్చర్ ఏర్పాటుకు రాకత్ శివ అనే మత్స్యకారుడు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇందుకోసం భారీ ఓడ లాంటి ప్లాట్ ఫామ్‌ను అతని బృందం తయారుచేస్తోంది. కేజ్ కల్చర్ అంటే సాధారణంగా ఒక్కొక్క పంజరం ఏర్పాటు చేసి, దాన్ని జలాశయాల్లోనో, సరస్సులోనో విడిచిపెడతారు. కానీ వాడరేవులో తయారయ్యే దానిలో 10 కేజ్‌లు ఒకే చోట ఉంటాయి. అంటే సముద్రమే క్షేత్రంగా చేపల సేద్యానికి శ్రీకారం చుడుతున్నారన్నమాట. సముద్ర చేపల పెంపకానికి సంబంధించి ఇదో భారీ ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. కొద్దిరోజుల్లో అతి పెద్ద కేజ్ కల్చర్ యూనిట్ జిల్లాలో ప్రారంభం కానుంది.
2019లోనే నిర్మాణానికి శ్రీకారం
వాడరేవులో ఉంటున్న రాకత్ శివ.. బోట్ల రూపకల్పనలో సిద్ధహస్తుడు. తన మేనళ్లులతో కలిసి మెరైన్ కల్చర్ గురించి తెలుసుకున్నారు. అప్పటికే కొందరు విజయవంతంగా దీనిని నిర్వహిస్తుండటంతో వాటి వివరాలు సేకరించారు. విడివిడిగా పంజరాలను పెడితే నిర్వహణా భారం పెరుగుతుందని గుర్తించి.. ఒకే చోట పది కేజ్ లు నిర్వహించే విధానంపై దృష్టి పెట్టాడు. ఆలోచనకు రూపకల్పన ఇస్తూ.. వాడరేవు సముద్ర తీరాన్నిఆనుకుని 2019 లో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
వంద టన్నులు ఉత్త్పత్తి లక్ష్యంగా..
కరోనా కారణంగా పనులకు మధ్యలో అంతరాయం జరిగినా.. ఇటీవలే మళ్లీ పనులు ప్రారంభించారు. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. భారీ ఓడలా ఉండే ఈ నిర్మాణాన్ని సముద్రంలో నిలిపి.. దిగువ భాగంలో ఉండే పంజరంలో చేపల పెంపకం చేపడతారు. ఆరు నెలల వ్యవధిలో వంద టన్నులు ఉత్త్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. మరికొద్ది రోజుల్లో దీన్ని సముద్రంలోకి విడిచిపెట్టి, చేపలు పెంపకం చేపడతారు. వినూత్న ఆలోచనతో, భారీ అంచనాలతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుతో సానుకూల ఫలితాలు వస్తే సముద్ర గర్భంలో కేజ్ కల్చర్‌కు మంచి ఆదరణ లభిస్తుంది.
ఇదీ చదవండి..
CBN: రెండేళ్లుగా బీసీల సామాజిక, ఆర్థికాభివృద్ధి ప్రశ్నార్థకమైంది: చంద్రబాబు