ఇనుము, సిమెంట్ ధరలు పెరుగుతుండటం.... నిర్మాణ రంగానికి పెను భారంగా మారాయి. ధరల పెరుగుదలతో కొత్త ఇళ్లు కట్టుకోవాలన్న మధ్య తరగతి ప్రజల ఆశలు ఆవిరవుతున్నాయి. రోజు రోజుకు మారుతున్న ధరలు చూసి సొంతింటి ఆశలు కలగానే ఉంటాయని ఆవేదన చెందుతున్నారు. ధరలు పెరగడంతో... వ్యాపారులు సైతం ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే ఇసుక లభించక నిర్మాణ రంగం అతలాకుతలం అవుతుంటే.. గోరుచుట్టుపై రోకలి పోటు అన్నట్లు సిమెంట్, ఇనుము ధరలు నిర్మాణదారునికి కంటతడి పెట్టిస్తున్నాయి. నిర్మాణ రంగ చరిత్రలో ఇనుముపై ఇంత ఎక్కువగా ధరలు పెరగలేదని... రెండు నెలలుగా దాదాపు టన్నుకు 15 వేల రూపాయలు పెరగడంతో.. వ్యాపారాలు దెబ్బతింటున్నాయని వ్యాపారస్తులు ఆవేదన చెందుతున్నారు.
నవంబర్ నుంచి ఈ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. రెండు నెలల కిందట టన్ను స్టీల్ ధర 40 వేల వరకు పలికేది. కానీ పెరిగిన ధరలతో ఇప్పుడు 55 వేలకు చేరింది. విశాఖ స్టీల్ అయితే 43 వేల నుంచి ఏకంగా 64 వేల రూపాయలకు ఎగబాకింది. సిమెంట్ ధర కూడా దాదాపు 70 శాతం పెరిగింది. 2018లో 180 రూపాయలు ఉన్న సిమెంట్ బస్తా ధర క్రమంగా పెరిగి ఇప్పుడు 350 వరకు పోతోంది. ఒక్కసారిగా పెరిగిన ధరలతో.. తీవ్ర నష్టాలకు గురవుతున్నామని వ్యాపారులు అంటున్నారు.