ప్రకాశం జిల్లా చినగంజాం మండలం పెదగంజాం పల్లెపాలెం. ఈ గ్రామంలో అందరూ మత్స్యకారులే. చేపల వేటే వీరి జీవనాధారం. గ్రామానికి చెందిన వల్లభుని ఉదయభాస్కర్ సామాజిక సేవ సబ్జెక్టుగా పీజీ చేశారు. అన్ని రంగాల్లో వెనుకబడిన తన గ్రామం కోసం ఏదైనా చేయాలనే లక్ష్యంతో పనిచేయడం ప్రారంభించారు. అలా ఎన్నో రకాలుగా గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించారు.
- అంతా అరోరానే
ఏడేళ్ల క్రితం 'అరోరా గ్రామాభివృద్ధి సమితి'ని ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. చదుపు మధ్యలో ఆపేసిన యువతను ప్రోత్సహించి దూరవిద్య ద్వారా చదువు పూర్తిచేసేలా చేశారు. అలా చదువుకున్న వారిలో కొంతమంది ప్రభుత్వం ఉద్యోగాలు చేస్తుండగా... మరికొంతమంది ప్రైవేటు కొలువుల్లో ఉన్నారు.
- ప్రణాళిక ప్రకారం పనులు
ప్రస్తుతం అరోరా సంస్దలో 25 మంది సభ్యులున్నారు. వీరంతా ప్రణాళిక ప్రకారం గ్రామాభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాలు చేపడతారు. మహిళలు స్వయం శక్తితో ఎదగాలని భావించి.. టైలరింగ్‌లో శిక్షణ ఇప్పించారు. ఇప్పటివరకూ దాదాపు 60 మంది శిక్షణ తీసుకోగా... చాలామంది ఈ వృత్తి ద్వారా జీవనోపాధి పొందుతున్నారు.
- కంప్యూటర్ శిక్షణ
అలాగే గ్రామంలోని నిరుద్యోగ యువతకు ప్రత్యేకంగా కంప్యూటర్ శిక్షణ అందిస్తున్నారు. ఇంతకుముందు కంప్యూటర్ కోర్సు నేర్చుకోవాలంటే ఒంగోలు, చీరాల వెళ్లాల్సివచ్చేది. అరోరా సంస్థ ద్వారా గ్రామంలోనే నేర్పిస్తుండటంతో.. ఎక్కువమంది యువత సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటున్నారు. నిరుద్యోగులకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తూ ఫోటోగ్రఫీ, డ్రైవింగ్ తదితర వాటిల్లోనూ శిక్షణ ఇప్పిస్తున్నారు.
- విద్యతోనే అభివృద్ధి
విద్యతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన అరోరా గ్రామాభివృద్ధి సంస్థ చదువుకు పెద్దపీట వేసింది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. ప్రధానోపాధ్యాయులు, గ్రామస్థుల సహకారంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా తోడ్పాటునందిస్తున్నారు. స్వతంత్ర, గణతంత్ర దినోత్సవాలు, ఇతర సందర్భాల్లో స్వచ్ఛభారత్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నారు. సముద్రతీరం వెంట ఉన్న చెట్ల పొదలను తొలగించి భూమిని చదును చేసి మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు.. ఆపదలో ఉన్న వారికి ఆర్ధిక తోడ్పాటు అందిస్తున్నారు.. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
తన బాగు మాత్రమే చూసుకోకుండా.. పుట్టి పెరిగిన ఊరుకు ఎంతో కొంత తిరిగిచ్చేద్దామనుకునే ఉదయభాస్కర్ లాంటి యువకుని కథ ఎందరికో అనుసరణీయం.
ఇవీ చదవండి... పచ్చని పల్లెలకు పాకుతున్న కరోనా