సొంతింటి కల ప్రతిపేదవారి జీవిత ఆశయం. అనుకున్నట్లు ఇల్లు కట్టుకుంటే ఇక ఆ పేదవారి ఆనందానికి హద్దే ఉండదు. అప్పటికే చుట్టూపక్కల ఉన్న వేల ఇళ్లల్లో ఒకటిగా నిలిస్తే... అందులోనూ ఆ కలల సౌధానికి జాతీయ స్థాయి గుర్తింపు లభిస్తే... ఏకంగా ప్రధానమంత్రితో మాట్లాడే అవకాశం వస్తే వారి ఆనందానికి అవధులుండవు. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ పేదింటికి ఆ ఘనత దక్కింది. ఇక్కడ కనిపిస్తున్న దంపతులది... ప్రకాశం జిల్లా అద్దంకిలోని నర్రావారిపాలెం. వీరు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పశువుల పాకలో ఉంటూ జీవనం సాగించేవారు. సొంత ఇల్లు అందంగా కట్టుకోవాలని కలలు కన్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌యోజన... ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం 2017 కింద ఆ కలను నిజం చేసుకున్నారు. వారి కలల సౌధాన్ని నిర్మించుకుని ఆదర్శంగా నిలిచారు.
అనంతలక్ష్మీ, తిరుపతయ్య దంపతులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం 2017లో ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణ కోసం ఇచ్చిన ఒకటిన్నర సెంట్ల స్థలాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని ఇల్లు నిర్మించుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులకు వీరు కొంత కలుపుకుని చక్కటి ఇల్లు కట్టుకున్నారు. అందులో ఓ హాలు, ఓ పడకగది, వంటగది, స్నానాలగది, పూజగది తదితర వసతులతో టైల్స్, ఆకర్షణీయమైన రంగులతో చూడముచ్చటగా తీర్చిదిద్దుకున్నారు. జిల్లాలోని 120 ఇళ్లను కేంద్ర అవార్డుకు పంపగా... వీరి కలల సౌధానికి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంతో.. ఆనందం వ్యక్తం చేస్తున్నారు.తక్కువ స్థలంలో అనుకున్న రీతిలో ఇల్లు నిర్మించుకున్న ఆనంతలక్ష్మి దంపతులు ఎంతో మంది పేదలకు మార్గం చూపారు.
ఇవీ చదవండి