Nara Lokesh Yuvagalam Padayatra in Prakasam District : సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అభివృద్ధిపై జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. 164వ రోజు సంతనూతలపాడు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా చీమకుర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
పేదవాడికి ఉన్నత విద్యను దూరం చేసిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వంది: వైసీపీ ప్రభుత్వం మెడికల్ కళాశాల ఫీజులు లక్షల్లో పెంచాడని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో వైద్య విద్య పూర్తి చేయడానికి కోటి రూపాయలు ఖర్చు అవుతుందని ఆరోపించారు. అంతా ఫీజులు సామాన్యులు భరించగలరా, పేదవాడికి ఉన్నత విద్యను దూరం చేయడానికి కుట్రలో భాగమే ఈ నూతన విధానమని ధ్వజమెత్తారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ను ప్రశ్నిస్తే, వైద్య శాఖ మంత్రి విడదల రజినీ ఇచ్చిన సమాధానం చూస్తే మతిపోతుందని ఆయన అన్నారు. వైద్య విద్య కోసం విద్యార్డులు విదేశాలకు వెళ్లి పోతున్నారని, వాళ్లను ఆపడానికి ఈ ఫీజులు పెంచామని చెపుతున్నారని విమర్శించారు. జగన్ ఒక మతం క్యాష్, కులం క్యాష్ అంటూ ఎద్దేవా చేశారు.
రిజర్వాయర్లను రైతులకు అందుబాటులోకి తీసుకువస్తాం : గిరిజనులపైన, దళితులపై దాడులు పెరిగాయని నారా లోకేశ్ గుర్తు చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ చరిత్రలో మిగిలిపోతారని లోకేశ్ అన్నారు. సంక్షోభంలో ఉన్న గ్రానైట్ పరిశ్రమను ఆదుకుంటానని, ఈ ప్రాంతంలో ఉన్న గుండ్లకమ్మ, రామతీర్థం రిజర్వాయర్లు మరమ్మతులు చేపట్టి రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.
"ప్రకాశం జిల్లాకు సీఎం జగన్ అనేక హామీలు ఇచ్చారు. అందులో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. జగన్ చేతకానితనం వల్ల గుండ్లకమ్మ ప్రాజెక్టు కొట్టుకుపోయింది. మేము చేసిన అభివృద్ధిపై, మీరు చేసిన అభివృద్ధిపై వైసీపీ నాయకులు చర్చకు సిద్దమా?"- నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
సైకో ముఖ్యమంత్రి ఎవరో ప్రజలు గుర్తించాలి : టీడీపీ కార్యకర్తల్ని వేధించిన అధికారుల పేర్లను ఎర్ర పుస్తకంలో రాసుకుంటున్నానని, జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేసి చర్యలు తీసుకుంటామని పార్టీ శ్రేణులకు దైర్యం చెప్పారు. వైసీపీ కార్యకర్తల్లా పనిచేసిన అధికారులు తగిన మూల్యం అనుభవించక తప్పదనీ హెచ్చరించారు. అవినీతి, అరాచక పాలనకు ప్రజలు ముగింపు పలకాలని అన్నారు. ఫ్రస్టేషన్ బాయ్ జగన్ టార్చర్ తట్టుకోలేక సొంత చెల్లెలు వేరే రాష్ట్రానికి పారిపోయిందని, బాబాయ్ హత్య కేసులో వాస్తవాలు బయటపడటంతో జగన్ మోహన్ రెడ్డికి కంగారు ప్రారంభం అయ్యిందని ఎద్దేవా చేశారు. మానవత్వం ఉన్న ముఖ్యమంత్రి ఎవరో, సైకో ముఖ్యమంత్రి ఎవరో ప్రజలు తెలుసుకోవాలని నారా లోకేశ్ అన్నారు.