ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెదేపా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. 38, 39వ డివిజన్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే విజయ్‌కుమార్ ప్రచారం చేపట్టారు. గత రెండు సంవత్సరాలుగా పట్టణం వెనుకబడిపోయిందని.. సమస్యలపై స్పందించే నాథుడే కరువయ్యారని అన్నారు. తాము గెలిస్తే.. పట్టణ సమస్యలు పరిష్కరిస్తామని విజయ్‌కుమార్ పేర్కొన్నారు. వైకాపా అభ్యర్థులు ఆటోలతో మైక్ ప్రచారం చేస్తూ.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా తెదేపా యువ నేత మాజీ మంత్రి నారా లోకేష్ ఒంగోలులో రోడ్ షో నిర్వహించారు. సంతపేట సాయిబాబా దేవాలయాన్ని దర్శించారు. మహా శివరాత్రి సందర్భంగా రుద్రాక్షాలతో తయారు చేసిన శివలింగాన్ని దర్శించి.. పూజలు నిర్వహించారు. 1వ డివిజన్ త్రోవగుంటలో రోడ్ షో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జీ నూకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
కనిగిరి నగర పంచాయతీలో వినూత్న రీతిలో అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ప్రచారం వేగం పెంచారు. పూలు అల్లుతూ.. దేవునికి మొక్కుతూ.. వినూత్న రీతిలో ఒటర్లను ఓట్లు అభ్యర్థిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.
పురపాలక ఎన్నికల ప్రచారాలకు మూడు రోజులే సమయం ఉండటంతో చీరాల మున్సిపల్ పరిధిలో పలు వార్డుల్లో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. 12వ వార్డు వైకాపా అభ్యర్థి మామిడాల రాములును గెలిపించాలని కోరుతూ ఎమ్యెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ప్రచారం నిర్వహించారు. తమకు ఓట్లు వేయాలని అభ్యర్థులు ఓటర్లకు అభ్యర్థించారు.
ఇదీ చూడండి:
చివరి దశకు చేరుకున్న పురపోరు... పోటాపోటీగా అధికార, విపక్షాల ప్రచారం