కరోనా కష్టకాలంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ.. సేవలందిస్తున్న జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించాలని ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాణాలను లెక్కచేయకుండా వృత్తిధర్మాన్ని నిర్వర్తిస్తున్న పాత్రికేయులను ఆదుకోవాలని కోరారు. విపత్కర సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం… ప్రాణాలు పోతున్నా పట్టించుకోకపోవటం బాధాకరమన్నారు.
మొదటి దశ కరోనా సమయంలో 45 మంది, రెండో దశలో 70 మందికి పైగా జర్నలిస్టులు మృతి చెందారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వందలాది మంది కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారని వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం చోద్యం చూడకుండా ఆయా కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. తొలి దశ కరోనా సమయంలో మరణించిన 45 మందికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్, సమాచార శాఖ మంత్రి.. ఇప్పుడు దాని ఊసేత్తటం లేదని సాంబశివరావు విమర్శించారు.
ఇదీ చదవండి: కరోనా: ఆయుర్వేద మందు కోసం పోటెత్తిన ప్రజలు