కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసే... జాతీయ పెట్టుబడులు, తయారీ జోన్ నిమ్జ్ భూసేకరణ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. పెదచెర్లోపల్లి మండలంలోని పెదఎర్లపాడు, పామూరు మండలంలోని బాదవాడు, మాలకొండాపురం, అయ్యన్నపేట, సిద్ధవరం, రేనిమడుగు గ్రామాల్లో... 14వేల 230 ఎకరాల్లో నిమ్జ్‌ను ప్రతిపాదించారు. ఇక్కడ 6వేల 495 ఎకరాల పట్టా భూములు, 3వేల 370 ఎకరాల అసైన్డ్ భూములు, 4వేల 364 ఎకరకాల ప్రభుత్వ భూములు ఉన్నాయి.
ప్రభుత్వ భూమిలో 1839 ఎకరాలను ఏపీఐఐసీకి ఇచ్చినా... ఇంకా పొజిషన్ చూపించలేదు. 1173 ఎకరాలు సీలింగ్ భూములు ఏపీఐఐసీ ఆధీనంలోకి తీసుకోవడానికి అనుమతులొచ్చాయి. ప్రస్తుతానికి కేవలం 331 ఎకరాలు మాత్రమే ఏపీఐసీసీకి అప్పగించారు. ఈ ప్రాంతంలో మౌలిక సుదుపాయాల కోసం ప్రతిపాదనలు తయారయ్యాయి. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ... కేంద్రం వాటా నిధులు ఇంతవరకూ రాలేదు.
దొనకొండలో ఏర్పాటుచేసే మెగా పారిశ్రామిక హబ్ అడుగు ముందుకు పడడం లేదు. ప్రాజెక్టుకు కావాల్సిన 25వేల 62 ఎకరాల భూసేకరణలో పురోగతి కనిపించడం లేదు. ఇక్కడ పట్టా భూమి 4వేల 407 ఎకరాలు మాత్రమే ఉంది. ప్రభుత్వ భూమి 12వేల 337 ఎకరాలు ఉండగా... 8వేల 287 ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. మొత్తంమీద ఏపీఐఐసీకి 2వేల 395 ఎకరాలు మాత్రమే అప్పగించారు.
ఇందులోనే 1454 ఎకరాలను ఏపీ గ్రీనరీ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్‌కు అప్పగించారు. రాగమొక్కపల్లెలో 43 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కును అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ 6.5 కోట్ల రూపాయల అంచనాతో రహదారులు, కాలువల నిర్మాణం చేపట్టగా... ఇప్పటి వరకూ 2.2 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. వాటికీ బిల్లులు రాకపోవడంతో.... పనులు మధ్యలోనే నిలిచిపోయాయి.
రామాయపట్నం పోర్టు విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పోర్టుకు సమీపంలో పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన సదుపాయాల కోసం... ఏపీఐఐసీ ద్వారా 3వేల 780.47 ఎకరాల భూసేకరణకు ప్రతిపాదనలు పంపిచారు. ఇందులో 926 ఎకరాలు ప్రభుత్వ భూమి, 2వేల 341 ఎకరాల పట్టా భూములు, 504 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయి. భూసేకరణ నిమిత్తం 659 కోట్ల రూపాయలు కోసం ప్రభుత్వానికి ఏపీఐఐసీ ప్రతిపాదనలు పంపినా... నిధులు విడుదల కాలేదు. ఈ ప్రాజెక్టుల్లో భూసేకరణ పనులు వేగవంతం చేస్తేనే... పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి: