Hijab controversy in prakasam district : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో హిజాబ్ తొలగించాలని యాజమాన్యం ఆంక్షలు విధించడంపై వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వికాస్ ప్రైవేటు పాఠశాలలో మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. పదో తరగతి చదివే విద్యార్థినులు హిజాబ్ తీసి పాఠశాలకు రావాలని యాజమాన్యం వారం రోజుల క్రితం చెప్పింది. మంగళవారం మరోమారు హెచ్చరించడంతో విద్యార్థులు విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలిపారు. ఆగ్రహించిన వారంతా పాఠశాలను ముట్టడించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూకుమ్మడిగా వచ్చి, నినాదాలు చేసి పాఠశాల పరువు తీయొద్దని కరెస్పాండెంట్ కోటిరెడ్డి అనడంతో ఆగ్రహించిన ముస్లింలు బడి లోపలకు చొరబడే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకొని ఎంఈవో ఆంజనేయులు అక్కడికి వచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్సై సురేష్ సిబ్బందితో వచ్చి ఆందోళన చేస్తున్న వారిని అక్కడి నుంచి పంపించారు. కొందరు ముఖ్యులు, పాఠశాల యాజమాన్యాన్ని కూర్చోబెట్టి మాట్లాడారు. హిజాబ్ ధరించడం మా సంప్రదాయమని ముస్లిం పెద్దలు అన్నారు. పిల్లల మంచి కోసం హిజాబ్ తీసి పాఠాలు వినాలని తాను అన్న మాట వాస్తవమేనని.. తప్పుగా భావిస్తే మన్నించాలని కరెస్పాండెంట్ కోటిరెడ్డి కోరారు.
గతంలో విజయవాడలో...
Hijab controversy in Vijayawada: విజయవాడలోని లయోల కళాశాలలో హిజాబ్ వివాదం నెలకొంది. హిజాబ్ వేసుకొచ్చామనే కారణంతో కాలేజీ యాజమాన్యం లోనికి అనుమతివ్వడంలేదని విద్యార్థినులు ఆరోపించారు. ఫస్ట్ ఇయర్ నుంచి తాము హిజాబ్‌తోనే కాలేజీకి వస్తున్నామని తెలిపారు. కాలేజీ ఐడీ కార్డులో కూడా తాము హిజాబ్‌తోనే ఫొటో దిగామని పేర్కొన్నారు. ఎప్పుడు లేనిది ఇప్పుడెందుకు ఆపుతున్నారంటూ విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. కాలేజీ యాజమాన్యం విద్యార్థినులను లోనికి అనుమతివ్వకపోవడంతో.. ముస్లిం పెద్దలు కళాశాల వద్దకు చేరుకున్నారు. లయోల కళాశాల వద్దకు చేరుకున్న పోలీసులు ప్రిన్సిపల్‌తో హిజాబ్ వివాదంపై చర్చించి సమస్యను పరిష్కరించారు. విద్యార్థులను తరగతుల్లోకి పంపారు. హిజాబ్ తీసివేసి రమ్మని కళాశాల యాజమాన్యం విద్యార్థినులకు చెప్పిందని.. తెదేపా పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఫతుల్లా అన్నారు.
ఇదీ చదవండి :
విజయవాడ లయోలా కళాశాలలో హిజాబ్ వివాదం... కాలేజీ వద్దకు చేరుకున్న ముస్లిం పెద్దలు