Temperatures Raises in AP: రాష్ట్రం నిప్పుల గుండాన్ని తలపిస్తోంది. ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలను దాటాయి. బాపట్ల, పల్నాడు, గుంటూరు, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లోనూ సుమారు 45 డిగ్రీల పైనే నమోదయ్యాయి. రాత్రి 8 గంటల తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెరుగుతున్న ఎండల ధాటికి ప్రజలు అల్లాడుతున్నారు. ఇళ్లలో ఉన్నా వేడిగాలులు తప్పడం లేదు. ఓవైపు వేడిగాలులు.. మరోవైపు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతూ.. ఉడికిపోతున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్లతో.. సెల్ టవర్లు దగ్ధమవుతున్నాయి. రోడ్డుపై ప్రయాణించే వాహనాల టైర్లు పేలిపోతున్నాయి.
బాపట్ల జిల్లా కొల్లూరులోని ఓ పొలంలో విద్యుదాఘాతం కారణంగా నిప్పు రవ్వలు రాలి మొక్కజొన్న వ్యర్థాలకు అంటుకుని పక్కనున్న మొక్కజొన్న కండెల గుట్టకు వ్యాపించాయి. దీంతో 5 ఎకరాల్లోని పంట కాలిపోయి సుమారు 3లక్షల 50వేల రూపాయల నష్టం వాటిల్లింది. పల్నాడు జిల్లాలోని వినుకొండ మండలం పెదకంచెర్లలో షార్ట్ సర్క్యూట్‌తో రెండు వరి గడ్డి వాములు ఆహుతయ్యాయి. విజయవాడ కృష్ణ లంకలో ఓ సెల్‌టవర్ దగ్ధమైంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎండ తీవ్రతకు గుంటూరు ఆటో నగర్ దగ్గర ఆర్టీసీ బస్సు టైరు పేలిపోయింది. డ్రైవర్ అప్రమత్తంగా ఉండి బస్సును నియంత్రించడంతో అందులోని ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.
సోమవారం నాడు వడదెబ్బకు ముగ్గురి మృతి: వడదెబ్బకు కృష్ణా జిల్లా గుడివాడలో ఇద్దరు మృతి చెందారు. ఆర్టీసీ బస్టాండు సమీపంలో పట్టణంలోని బాపూజీ నగర్‌కు చెందిన ఎండీ రెహ్మాన్ (45) సోమవారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో కుప్పకూలాడు. కొద్దిసేపటికే అతను మృతి చెందాడు. మరోవైపు పట్టణంలోని ఇందిరా నగర్ కాలనీ ప్రాంతానికి చెందిన సూరగాని సురేష్ (38) సోమవారం మధ్యాహ్నం కార్మికనగర్ ఎదురుగా ఉన్న రైస్‌మిల్లు పక్కన పడిపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో సాయంత్రం 4:30 గంటల వరకు అతను అక్కడే పడి ఉన్నాడు. అతను మందు తాగి ఉండటం.. మంచి నీరు ఇచ్చేవారు ఎవరూ లేకపోవడంతో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం గొడ్డు వెలగల పంచాయతీ జీడిమేకలపల్లికి చెందిన అన్వర్‌బాషా(65) సోమవారం ఉపాధి పనులు చేస్తుండగా వడదెబ్బకు గురై మృతి చెందారు.
నేడు అధిక ఉష్ణోగ్రతలు: ఇప్పటికే ఎండలతో అల్లాడుతున్న ప్రజలపై విపత్తుల సంస్థ మరో బాంబు పేల్చింది. రాష్ట్రంలో నేడు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. సుమారు 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంగి. అలాగే 194 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని.. పలు జిల్లాల్లో 45 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని గట్టి హెచ్చరికలు జారీ చేసింది.
ఇవీ చదవండి: