రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు పలు జిల్లాల్లో పంటలు జలమయమయ్యాయి. చేతికొచ్చిన పంట నీటిపాలు అయ్యింది. కర్షకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా జిల్లా
మైలవరంలో కురిసిన భారీ వర్షానికి ధాన్యం, పత్తి పంటలు నీటమునిగాయి. నష్టపోయిన రైతులను స్థానిక మార్కెట్ యార్డు వద్ద... మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరామర్శించారు.
గుంటూరు జిల్లా
గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షానికి బొల్లాపల్లి, శావల్యాపురం, నూజెండ్ల మండలాల్లో వరి పంటలు నీటమునిగాయి. చింతలపాలెం గ్రామంలో మిర్చి, పొగాకు పంటలు నేలకొరిగాయి. వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించి పంట నష్టం అంచనా వేసి సహాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
ప్రకాశం జిల్లా
ప్రకాశం జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. ఈ ఏడాది గిట్టుబాటు ధరలు అనుకూలించగా... వరి, కంది, మినప, పత్తి తదితర పంటలను రైతులు పెద్ద మొత్తంలో సాగు చేశారు. కానీ గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు పొలాల్లోకి చేరిన నీరు కాలువలను తలపిస్తున్నాయి. నీరు పుష్కలంగా ఉండి పంట బాగా పండింది. తీరా పంట కోసి అమ్ముకుందామనే సమయంలో... వర్షం కారణంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: అకాల వర్షాలు... రైతులకు తీవ్ర నష్టాలు