సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ప్రకాశంజిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో గొట్టిపాటి హనుమంతరావు మెమోరియల్ 33వ రాష్ట్ర రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి గిత్తల పోటీలు ఆరంభమయ్యాయి. వారం రోజులపాటు జరగనున్న పోటీలను వైకాపా నాయకులు గొట్టిపాటి భరత్ ప్రారంభించారు. తొలిరోజు పాలపళ్ల విభాగంలో పోటీలు జరిగాయి. ఈవిభాగంలో విజేతలుగా నిలిచిన వారికి మొదటి బహుమతి 15 వేల నూట పదహార్లు, రెండో బహుమతి 10 వేల నూట పదహార్లు, మూడో బహుమతి 8 వేల నూట పదహార్లు అందించనున్నారు. ఒంగోలు జాతి పశుపోషకులను ప్రోత్సహించేందుకు పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు.
బహుమతులను సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ వారు అందిస్తున్నారు. తొలిరోజు చిన్నసైజు విభాగంలో 19 జతలు పోటీలకు వచ్చాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన కాకాని సురేష్ బాబు, ముత్తాయపాలెం గ్రామానికి చెందిన పుల్లగూర యోహానుల సంయుక్త జత.. నాలుగు క్వింటాల బరువు గల బండను పది నిమిషాల వ్యవధిలో 4409 అడుగుల 9 అంగుళాల దూరం లాగింది.
ఇదీ చదవండీ..పండుగ సంతోషానికి ధరల దెబ్బ