ప్రకాశం జిల్లా పెదారగట్ల సమీపంలో జి. కోటేశ్వరరావు, సుజాత దంపతులు 50 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వీరి క్షేత్రంలో పండ్లతోటలు కూడా వేశారు. సీతాఫలం, దానిమ్మ, జామ వంటివి వేశారు. అయితే అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ పక్షుల బెడద తీవ్రంగా ఉంటుంది. రామచిలుకల దండు వచ్చి కోతకు వచ్చిన పండ్లను తినేస్తున్నాయి. దీని వల్ల పంట నష్టం వాటిల్లుతుంది. అలాగని ఏదైనా చర్యలు చేపడితే పక్షులు ప్రాణాలకు హాని కలుగుతుందని భావించి అలాంటి పనులు చేయలేదు కోటేశ్వరరావు.
పొలం చుట్టూ పక్షులు కోసం జొన్న వంటి చిరుధాన్యాలు వేశారు. పండ్లతోటల్లోకి పక్షులు రాకుండా ఉండేందుకు పెద్ద శబ్దాలు చేసే విధంగా సౌర శక్తితో పనిచేసే శబ్ద పరికరం (అలారం) తయారు చేసి పెట్టారు. నాలుగు ఎకరాల తోటలో నాలుగు చోట్ల వీటిని ఏర్పాటు చేయడంతో పగలంతా వివిధ రకాల శబ్దాలతో పనిచేస్తాయి. ఇది కూడా పక్షుల కూతలానే ఉంటాయి. తమకు హాని చేసే పక్షులు ఉన్నాయని భావించి పక్షులు తోటల్లోకి రావడం మానేశాయి. కోటేశ్వరరావు సొంతంగా వీటిని తయారు చేశారు.
చిన్న పరిమాణంలో సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసి, నేరుగా అలారానికి విద్యుత్ అందించి పగలంతా శబ్దం అయ్యే విధంగా ఏర్పాటు చేశారు. ఒకో దానికి 2వేల రూపాయలు ఖర్చు పెట్టారు. పవన శక్తితో పనిచేసే మరో శబ్ద భేరిని కూడా ఏర్పాటు చేశారు. ఈ అలారం ప్లాన్‌తో పక్షుల బెడద తగ్గిందని రైతులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: