ఎంతో ప్రాధాన్యమున్న పాత చెన్నై రహదారిని... ప్రకాశం జిల్లా పర్చూరు - ఇంకొల్లు మధ్య పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు మోక్షం లభించింది. ఇందుకోసం సీఆర్‌ఐఎఫ్ నిధులు రూ.22 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తంతో పర్చూరు 0.375 నుంచి ఇంకొల్లు 19.680 కి.మీ.వరకు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నారు. పెరిగిన ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని... ప్రస్తుతం 5.5 మీటర్ల వెడల్పున ఉన్న రోడ్డును ఏడు మీటర్లకు విస్తరించనున్నారు.
ఆక్రమణలే అసలు సమస్య...
పర్చూరు - ఇంకొల్లు మధ్య రహదారి అంచులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో... వర్షాల సమయంలో నీరంతా రోడ్డుపైకి చేరి దెబ్బతింటుంది. కొందరు ఇళ్ల యజమానులు, దుకాణదారులు... వాడుక నీరు రోడ్డుపైకి వచ్చేలా ఏకంగా తూములు ఏర్పాటు చేశారు. ఇంకొల్లు, పర్చూరు ప్రధాన గ్రామాల పరిధిలో కాలువలను పూడ్చి నిర్మాణాలు చేపట్టడంతో సమస్య మరింత తీవ్రంగా ఉంది. ఇంకొల్లులో రహదారి ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సెప్టెంబరు 23న హైకోర్టు ఆదేశించింది. డిసెంబరు 2న హైకోర్టులో వాయిదా ఉన్న నేపథ్యంలో... ఆక్రమణల తొలగింపులో భాగంగా గుర్తించిన 493 మంది ఆక్రమణదారులకు పంచాయతీ అధికారులు తాఖీదులు జారీ చేస్తున్నారు. వారం రోజుల్లోగా ఆక్రమణలు తొలగించాలని లేకుంటే తామే తొలగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసు, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారుల సహకారంతో ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు పంచాయతీ కార్యదర్శి కిరణ్ తెలిపారు. పర్చూరులోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. హైకోర్టు ఆదేశాలు ఉన్నా... అడ్డగోలుగా సాగుతున్న అక్రమ నిర్మాణాలను అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
కాలువలు నిర్మిస్తేనే ప్రయోజనం...
ఆక్రమణల కారణంగా మురుగు పారుదల నిలిచిపోవడమే కాదు... నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. భారీ వాహనాలు, లారీలు తిరిగే మార్గం కావడంతో ఇంకొల్లు పరిధిలో... ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్రమణలు తొలగించి... కాలువల నిర్మాణం చేపట్టాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు. దీనివల్ల కొత్తగా వేసే రహదారి దెబ్బతినకుండా ఉండడంతో పాటు, మురుగు సమస్యకూ పరిష్కారం లభిస్తుందని... ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు.
ఇదీ చదవండి: